డెడ్‌లైన్ వచ్చేస్తోంది

ఒకవైపు ప్రధాని మోడీ జీఎస్టీ ప్రకటన మార్కెట్లో ఉత్సాహం నింపగా… మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు మాత్రం తమ షార్ట్ పొజిషన్స్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇవాళ నిఫ్టి 25000 స్థాయిని టచ్ చేసినా… ఆ స్థాయిలో ఎక్కువ సేపు నిలబడ లేకపోయింది. దీనికి ప్రధాన కారణం… అమెరికా సుంకాల డెడ్‌లైన్ సమీస్తుండటమే. పాత షెడ్యూల్ ప్రకారం అమెరికా, భారత్‌ల మధ్య ఆరో విడత వాణిజ్య చర్చలు ఈనెల 25వ తేదీన జరగాల్సి ఉంది. భారత్‌పై సుంకాలను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచుతూ… అమెరికా తదుపరి చర్చలను వాయిదా వేసింది. దీంతో సుంకాల అమలు ఈనెల 27 నుంచి ఖాయంగా కన్పిస్తోంది. రష్యా చమురు కొంటున్నారంటూ మన దేశంపై విధించిన అదనపు సుంకంపై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. అమెరికా, రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరితే… సుంకాల విషయంలో కాస్త క్లారిటీ వచ్చే అవకాశముంది. ఒకవేళ ఈ చర్చలు కూడా వాయిదా పడితే మాత్రం భారత ఎగుమతిదారులకు కష్టాలు తప్పేలా లేవు. దీంతో ఇపుడు రష్యా, అమెరికా చర్చలు కీలకంగా మారాయి. ఇవాళ ట్రంప్, జెలెన్స్కీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. వీటి ఫలితాల కోసం మార్కెట్ ఎదురు చూస్తోంది. ఈ విషయమై క్లారిటీ వచ్చి… సుంకాల భారం తగ్గితే మార్కెట్లో సుదీర్ఘ ర్యాలీకి ఛాన్స్ ఉంది.