పతనంలో ఆల్‌టైమ్ రికార్డు
విదేశీ మారక ద్రవ్య మార్కెట్ (ఫారెక్స్)లో డాలర్‌తో రూపాయి ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. మోడీ హయాంలో రోజుకో కొత్త చెత్త రికార్డు సృష్టిస్తోంది. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డాలర్‌తో రూపాయి పతనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మోడీ… ఇపుడు ఆయన ప్రభుత్వ పెద్దలు నోరు మెదపడం లేదు. ఇవాళ డాలర్‌తో రూపాయి విలువ 84.37కు పతనమైంది. 2014 మే 15న డాలర్‌తో రూపాయి మారకం విలువ 59.44. అంటే మోడీ అధికారంలో వచ్చే సమయంలో 59.44 రూపాయలు ఇస్తే ఒక డాలర్ వచ్చేది. ఇపుడు 84.37 రూపాయలు ఇస్తే ఒక డాలర్ వస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన తరవాత డాలర్ జెట్ స్పీడుతో పెరుగుతోంది. ఎన్నికల ప్రారంభం ముందు డాలర్ ఇండెక్స్ 100 ప్రాంతంలో ఉండేది. ఇపుడు 105ని తాకింది. ట్రంప్ పదవీ స్వీకారం చేసే నాటికి అంటే వచ్చే జనవరికల్లా డాలర్ మరింత బలపడే అవకాశముంది. అంటే రూపాయి మరింత బలహీనపడుతుందన్నమాట. దీనివల్ల ఫార్మా, ఐటీ కంపెనీలకు లాభాలు ఉన్నా… ముడి చమురు కోసం మన దేశం భారీ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. రూపాయి మరింత పడిపోకుండా గత కొన్ని వారాలు ఆర్బీఐ భారీ ఎత్తున డాలర్లను అమ్ముతోంది. అయినా రూపాయి పతనం ఆగడం లేదు. మున్ముందు డాలర్, రూపాయి మారకం విలువను ఆర్బీఐ ఎలా నిర్వహిస్తుందో చూడాలి.