మొత్తం ఆదాయంలో BRS 79%… YSRCP 64 %
రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ కల్పతరువుగా మారాయి. దీనికి సంబంధించిన కేసును ముట్టుకోవడానికి కూడా సుప్రీం కోర్టు భయపడుతోందంటే… దీని ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా నిధులు అందించే వారి వివరాలు ఎప్పటికీ బయట పడవు. దీంతో నల్లధనం మొత్తం ఈ బాండ్స్ రూపంలో రాజకీయ పార్టీలకు వెళుతోందని ఆరోపిస్తూ పలువురు సుప్రీంలో పిటీషన్ వేశారు. కోర్టు దీనిని తేల్చకపోవడంతో… ప్రతి ఏటా పార్టీలకు వేల కోట్లు వచ్చి చేరుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఖాతాల్లోకి వేల కోట్లు వచ్చి చేరాయి. ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీకి ఏమాత్రం తీసిపోవడం లేదు. 2021-22 ఏడాదికి ఆయా పార్టీలు ప్రధాన ఎన్నికల సంఘానికి సమర్పించిన డేటా ప్రకారం ఒడిశాలో బీజేడీ ప్రభుత్వానికి వందల కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చాయి. అపార ఖనిజాలు ఉన్న ఆ రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్లూచిప్ కంపెనీలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థికంగా ఎలా ఉన్నా… బీజేడీ మాత్రం బీజేపీకి ఏమాత్రం తీసపోవడం లేదు. 2021-22లో ఆ పార్టీ మొత్తం ఆదాయం రూ. 307.28 కోట్లు కాగా, ఇందులో 94 శాతం మొత్తం అంటే రూ. 291 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చినదే. ఈ నిధులు ఎవరు ఇచ్చారనేది ఎప్పటికీ సస్పెన్స్. ఇలాగే టీఆర్ఎస్ (బీఆర్ఎస్) కూడా. 2021-22లో ఈ పార్టీ మొత్తం ఆదాయం రూ. 218.11 కోట్లు కాగా, 70 శాతం మొత్తం అంటే రూ. 153 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చాయి. ఇక ఏపీలో వైసీపీ కూడా తన మొత్తం ఆదాయంలో 64 శాతం ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా సమకూర్చుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ పార్టీ మొత్తం ఆదాయం రూ. 93.72 కోట్లు కాగా, రూ. 60 కోట్లు అంటే 64 శాతం మొత్తం ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చాయి. టీడీపీ ఇంకా తన ఖాతాలను పంపాల్సి ఉంది. యూపీకి చెందిన సమాజ్వాదీ పార్టీకి మాత్రం మొత్తం ఆదాయంలో కేవలం పది శాతం మొత్తం మాత్రమే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చాయి. ఆ పార్టీ మొత్తం ఆదాయం రూ. 33 కోట్లు కాగా, అందులో పది శాతం అంటే రూ.3.21 కోట్లు ఈ బాండ్స్ ద్వారా వచ్చాయి.మొత్తానికి ఈ ఎలక్టోరల్ బాండ్స్ కూడా చాలా చిత్రంగా అధికారంలో ఉన్న పార్టీల ఖాతాల్లోకి దూసుకు వస్తున్నాయి. విపక్షంలో ఉన్న పలు పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చిన మొత్తం నామమాత్రమేగానే ఉంటున్నాయి.