For Money

Business News

ఎల్‌ఐసీ నిర్వహణకు ప్రైవేట్‌ సీఈఓలు?

ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీను ప్రైవేట్ ప‌రం చేసే దిశ‌గా మ‌రో అడుగు పడే అవకాశముంది. ఎల్ఐసీకి మొద‌టి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా (సీఈఓ) ప్రైవేట్ రంగంలోని నిపుణుడిని నియమించే ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ సీనియర్‌ అధికారులే దీన్ని నిర్వహిస్తున్నారు. ‘ప్రైవేట్ సంస్థకు చెందిన వ్యక్తిని సీఈఓగా నియ‌మించ‌డం వ‌ల్ల మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తాయి. షేర్ హోల్డర్స్‌కు ఇది శుభ ప‌రిణామం’ అని మ‌రొక‌ ప్రభుత్వ అధికారి తెలిపినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. ఎల్ఐసీకి ప్రైవేట్ రంగంలోని వ్యక్తిని బాస్‌గా నియ‌మించ‌డాన్ని తాను స‌మ‌ర్థిస్తున్నట్టు ఆర్థిక శాఖ మాజీ కార్యద‌ర్శి సుభాష్ చంద్ర గార్గ్‌ రాయిటర్‌తో అన్నారు. అర్హులైన వ్యక్తుల నుంచి ప్రభుత్వం ఇప్పటికే ద‌ర‌ఖాస్తులు అహ్వానించినట్లు తెలుస్తున్నా… ఎవరూ అధికారికంగా ధృవీకరించడం లేదు. ప్రస్తుతం మంగ‌ళం రామ‌సుబ్రమ‌ణియ‌న్ కుమార్ ఎల్ఐసీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయ‌న ప‌ద‌వీకాలం వ‌చ్చే ఏడాది మార్చిలో ముగుస్తుంది. ఈయన తరవాత ఎల్‌ఐసీకి ఛైర్మన్‌ పదివిని రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఈఓను నియమించేలా ఎల్ఐసీ చట్టంలో ప్రభుత్వం ఇది వరకే మార్పులు చేసింది. అయితే ప్రైవేట్‌ వ్యక్తులకు ఎల్ఐసీని అప్పగించడంతో ఈ సంస్థ నిర్వహణ పూర్తిగా వ్యాపారాత్మకంగా మారడంతో పాటు పెట్టుబడి నిర్ణయాల వెనుక కంపెనీల పాత్ర పెరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ప్రతికూల పరిస్థితుల్లో ఎల్‌ఐసీని షేర్‌ మార్కెట్లోకి తెచ్చింది. ఈ షేర్‌లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ఇప్పటి వరకు దాదాపు రూ. 2 లక్షల కోట్లు నష్టపోయారు. ఎల్‌ఐసీ ప్రస్తుతం రూ. 41 లక్షల కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది.