For Money

Business News

చుక్కలు చూపిన పాలిక్యాబ్‌ షేర్లు

కేవలం నాలుగుళ్ళలో 11 రెట్ల లాభాలు తన ఇన్వెస్టర్లకు అందించిన పాలిక్యాబ్‌ షేర్లు ఇవాళ చుక్కలు చూపింది. 2019 ఏప్రిల్‌లో రూ. 538 వద్ద ఈ కంపెనీ షేర్లను ఆఫర్‌ చేసింది. అక్కడి నుంచి ఈ షేర్‌ వెనక్కి తిరిగి చూడలేదు. ముఖ్యంగా గత ఏడాది ఈ షేర్‌లో వచ్చిన బుల్‌రన్‌ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించింది. గత ఏడాది జనవరి 10న రూ. 2630ని తాకిన ఈ షేర్‌… ఏడాది కూడా పూర్తవకముందే డిసెంబర్‌లో రూ. 5733ని తాకింది. అక్కడి నుంచి తగ్గుతూ వచ్చిన ఈ షేర్‌ నిన్న రూ. 4911 వద్ద ముగిసింది. అయితే ఈ కంపెనీపై ఐటీ దాడులు జరుగుతున్నాయన్న వార్తలు రావడంతో ఈ షేర్‌లో అమ్మకాల ఒత్తిడి ప్రారంభమైంది. ఈ నెల 8వ తేదీన కూడా ఈ షేర్‌ ధర రూ.5455 వద్ద ఉండగా.. క్రమంగా తగ్గుతూ వచ్చింది. దాదాపు రూ. 600 క్షీణించింది. అయితే కంపెనీ వద్ద రూ. 1000 కోట్లకు సంబంధించిన అనధికార లావాదేవీలను గుర్తించినట్లు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు చెప్పడంతో ఇవాళ షేర్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఐటీ అధికారులు జారీ చేసిన ప్రకటనలో కంపెనీ పేరు లేకున్నా… ఈ లావాదేవీలు పాలిక్యాబ్‌లోనే జరిగినట్లు ప్రధాన మీడియా సంస్థలు వెల్లడించాయి. దీంతో ఉదయం రెండుసార్లు లోయర్‌ సీలింగ్‌ పడింది. షేర్‌ ధర రూ. 3975కి పడిపోయింది. 20 శాతం తరవాత కూడా అమ్మకాల ఒత్తిడి వచ్చింది. దాదాపు 22 శాతం పడిన తరవాత అంటే రూ. 3801 వద్ద కొనుగోళ్ళ మద్దతు అందింది. అయితే ఉదయం నుంచి అనేక ఛానల్స్‌ ఈ షేర్‌ జోలికి పోవద్దని ఇన్వెస్టర్లను హెచ్చరించాయి. ఈ దాడుల వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నట్లు మార్కెట్‌లో వదంతులు వచ్చాయి. దీంతో ఈ షేర్‌కు స్వల్ప మద్దతు వచ్చినా… షేర్‌ నిలబడేలకపోయింది. దిగువస్థాయి నుంచి రూ. 300లు కోలుకున్నా… తరవాత వరుసగా అమ్మకాల ఒత్తిడి రావడంతో ఈ షేర్‌ రూ.3878 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ షేర్‌ 21 శాతం నష్టంతో ముగిసింది. ఈ ఒక్కరోజే ఈ షేర్‌ రూ. 1033 నష్టపోయింది. మరి ఈ షేర్‌కు దిగువస్థాయిలో మద్దతు లభిస్తుందేమో చూడాలి. అయితే సాధారణ ఇన్వెస్టర్లు మాత్రం ఈ షేర్‌ జోలికి ఇపుడే వెళ్ళొద్దని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు.