For Money

Business News

18000 దిగువకు నిఫ్టి

సింగపూర్ నిఫ్టి సూచించిన స్థాయిలోనే భారీ నష్టాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 17975ని తాకింది. అక్కడి నుంచి స్వల్పంగా కోలుకుని 18031 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 96 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 333 పాయింట్లు నష్టపోయింది. రిలయన్స్‌ చాలా స్థిరంగా ఉంది. దీంతో నిఫ్టి పతనం ఆగింది. ఇక ఫార్మా తప్ప మిగిలిన అన్ని కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి ఉంది. ముఖ్యంగా ఐటీ షేర్లలో ఒత్తిడి కొనసాగుతోంది. అలాగే బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ వంటి ఎన్‌బీఎఫ్‌స్‌ వంటి షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి ఉంది. ఇక సూచీల విషయానికొస్తే ఒత్తిడి అధికంగా ఉంది. నిఫ్టి 0.64 శాతం నష్టపోగా నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్ట్ మిడ్‌ క్యాప్‌ సూచీలు కూడా ఒక శాతంపైగా నష్టంతో ఉన్నాయి. నిఫ్టి బ్యాంక్‌ కూడా 0.89 శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో కేవలం ఆరు షేర్లు మాత్రమే గ్రీన్‌లో ఉన్నాయి. వీటిలో అధిక భాగం ఫార్మా షేర్లే. అదానీ గ్రూప్‌ షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది. అలాగే న్యూఏజ్‌ షేర్లలో కూడా అమ్మకాల జోరు అధికంగా ఉంది. జొమాటొ, నైకా, నౌకరి షేర్లు 3 నుంచి 4 శాతం నష్టపోయాయి. నిఫ్టి బ్యాంక్‌లోని మొత్తం 12 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇటీవల పెరిగిన మిడ్‌ క్యాప్‌ బ్యాంకు షేర్లు ఇపుడు క్రమంగా నష్టపోతున్నాయి. ఫార్మా షేర్లతో పాటు మెడికల్ టెస్టింగ్‌ ల్యాబ్‌ షేర్లు కూడా వెలుగులో ఉన్నాయి.