మళ్ళీ 16700 దిగువకు నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లోకి జారుకోవడంతో నిఫ్టి ఉదయం నుంచి ఆర్జించిన లాభాలను కోల్పోవడమేగాక… మరో ఒక శాతం మేరకు నష్టపోయింది. రాత్రి అమెరికా మార్కెట్లు, ఉదయం ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నా… నిఫ్టి లాభాలతో ప్రారంభమైంది. ఓపెనైన కొద్దిసేపటికే 16,927 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చైనా, ఆసియా మార్కెట్లలో రక్తపాతమే. హాంగ్‌సెంగ్ ఏకంగా 5.6 శాతం నష్టంతో ముగిసింది. ఇక చైనా మార్కెట్లు కూడా దాదాపు అయిదు శాతం నష్టపోయాయి. అనేక చైనా కంపెనీలు ఇతర దేశాల్లో లిస్టయ్యాయి. చైనా మార్కెట్ ప్రభావం ఆయా దేశాల్లో కన్పిస్తోంది. చైనాలో లాక్‌డౌన్ కారణంగా మన దేశీయ కంపెనీలపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. అనేక కంపెనీల ముడి పదార్థాలు చైనా నుంచి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా ఫ్యూచర్స్ నష్టాల్లోనే ఉండటం, యూరో మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం కావడంతో నిఫ్టి కేవలం గంటలో లాభాల నుంచి ఒక శాతం నష్టంలో జారుకుంది. ప్రస్తుతం 16,696 వద్ద ట్రేడవుతోంది. అంటే గరిష్ఠస్థాయి నుంచి 250 పాయింట్లు పడింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 175 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టి మిడ్ క్యాప్ షేర్లలో పెద్ద తేడా లేకున్నా నిఫ్టి నెక్స్ట్ కూడా 0.75 శాతం నష్టపోయింది. ఫెడ్ నిర్ణయం, చైనా మార్కెట్ల పతనం ఇపుడు మన మార్కెట్లతో పాటు ఇతర మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి.