For Money

Business News

కోవిడ్‌ టైమ్‌ కన్నా అధికంగా…

చైనా ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ఆర్థిక, ద్రవ్య పరమైన సంస్కరణలు భారత స్టాక్‌ మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. గత కొన్ని నెలలుగా భారత స్టాక్‌ మార్కెట్‌ వ్యాల్యూయేషన్‌ పట్ల అసంతృప్తిగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్‌ నెలలో దిమ్మతిరిగే స్థాయిలో అమ్మకాలు చేశారు. జనవరి నుంచి పడుతూ వస్తున్న చైనా మార్కెట్లు ఇపుడు ఆకర్షణీయంగా మారాయని విదేశీ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఒక పద్ధతి పాడూ లేకుండా భారత స్టాక్‌ మార్కెట్లు పెరుగుతున్నాయని… అనామక షేర్లు కూడా ఎన్నడూ ఊహించినట్లు పెరుగుతున్నాయని వీరు బాహాటంగా అంటున్నారు. వాస్తవానికి విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు మన మార్కెట్లు ఎపుడో కుదేలు అయిపోయేవి. కాని దేశీయ ఆర్థిక సంస్థలు పోటాపోటీగా కొనుగోళ్ళు చేస్తున్నందున… నిఫ్టి ఆ మాత్రం నిలదొక్కుకుంటోందని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. అక్టోబర్‌ నెలలో ఇప్పటి వరకు మన మార్కెట్లలో రూ. 67,834 కోట్ల విలువైన షేర్లను నికరంగా విదేశీ ఇన్వెస్టర్లు అమ్మారు. నిజానికి 2020 మార్చిలో అంటే కోవిడ్‌ భూతం వల్ల స్టాక్‌ మార్కటె్‌ దెబ్బతిన్న సమయంలో కూడా స్థాయి అమ్మకాలు చేయలేదు విదేశీ ఇన్వెస్టర్లు. 2020 మార్చి పూర్తి నెలలో విదేశీ ఇన్వెస్టర్లు రూ. 61,972 కోట్ల విలువైన షేర్లను నికరంగా అమ్మారు. అక్టోబర్‌ నెలలో ఇవాళ్టి అమ్మకాలు అంటే రూ. 7,421 కోట్లను కూడా కలుపుకుంటే విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు రూ. 75,000 కోట్లను దాటేసినట్లేనని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలను తట్టుకునేందుకు వీలుగా దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIs) అక్టోబర్‌ నెలలో 15వ తేదీ వరకు రూ. 63,981 కోట్ల షేర్లను నికరంగా కొనుగోలు చేశారు. స్టాక్‌ మార్కెట్‌లో చరిత్రలో కేవలం 15 రోజుల్లో DIIలు ఈ స్థాయిలో కొనుగోళ్ళు చేయడం ఇదే మొదటిసారి. విదేశీ ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో పెట్టుబడులను భారత్‌ నుంచి చైనాకు తరలించడంతో పాటు ఇటీవల క్రూడ్‌ ధరలు బాగా పెరగడంతో రూపాయిపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. భారత రిజర్వు బ్యాంకు భారీ స్థాయిలో డాలర్లను అమ్ముతున్నా… రూపాయి 84ను దాటి ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి చేరింది. మరి మున్ముందైనా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు జోరు తగ్గుతుందేమో చూడాలి మరి.

Leave a Reply