For Money

Business News

విదేశీ ఇన్వెస్టర్లు గుడ్‌బై

సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముందు విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) భారీ అమ్మకాలు చేపట్టారు. గత కొన్ని నెలల నుంచి అమ్మకాలు చేస్తున్నా… ఇటీవలి కాలంలో వీరి అమ్మకాలు మార్కెట్‌ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. భారతీయ రీటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి భారీ మొత్తంలో సొమ్ము మార్కెట్లలోకి వస్తోంది. దీంతో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు సూచీలను కాపాడుతున్నారు. కాని మే నెలలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. మే నెలలో వీరు రూ. 25,000 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. సాధారణంగా మే నెలలో భారీగా అమ్మకాలు చేయడం మళ్ళీ సమ్మర్‌ హాలిడేస్‌ తరవాత మార్కెట్‌లోకి రావడం వాల్‌స్ట్రీట్‌ రివాజు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాదని, దీంతో స్టాక్‌ మార్కెట్‌ కరెక్షన్‌కు ఛాన్స్‌ ఉందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. మరికొందరు మాత్రం భారత మార్కెట్‌లో ప్రధాన షేర్ల వ్యాల్యూయేషన్‌ వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని అంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు, ఎన్నికలకు సంబంధం లేదనే చెప్పే మరో వర్గం కూడా ఉంది. ప్రధాన మీడియా సంస్థలు దీన్నే ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్ల నుంచి భారీ ప్రతిఫలం అందుతోందని, అందుకే అక్కడికి తమ పెట్టుబడులను వీరు తరలిస్తున్నారని ఈ వర్గం వాదిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో చైనా ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల కారణంగా స్టాక్‌ మార్కెట్‌ బుడగ పగిలింది. దీంతో అనేక బ్లూచిప్‌ షేర్ల ధరలు గణనీయంగా తగ్గాయి. ధరలు చాలా ఆకర్షణీయంగా మారాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు వర్ధమాన మార్కెట్ల నుంచి ముఖ్యంగా భారత్‌ నుంచి తమ పెట్టుబడులను చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లకు తరలిస్తున్నాయి. వర్ధమాన మార్కెట్ల నుంచి భారీగా నిధులు తరలించిన దేశాల్లో మన దేశం అగ్రస్థానంలో ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు చైనాకు తరలించడంతో అక్కడి సూచీలు బాగా పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో హాంగ్‌సెంగ్‌ 8 శాతం పైగా పెరగడం విశేషం. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ నిధులను చైనాకు తరలిస్తున్నాయని మన మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ గనుక అధికారంలోకి రాకపోతే… మార్కెట్లకు భారీ కుదుపు తప్పదని కొందరు అనలిస్టులు హెచ్చరిస్తున్నారు.