For Money

Business News

అమెరికా బ్యాంకులకు ఫిచ్‌ వార్నింగ్‌

ఇటీవల అమెరికా రేటింగ్‌ను తగ్గించిన ఫిచ్‌ రేటింగ్‌ సంస్థ ఇపుడు అమెరికా బ్యాంకులకు హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని దాదాపు అన్ని బ్యాంకుల రేటింగ్‌లో కోత పడే అవకాశముందని హెచ్చరించింది. ముఖ్యంగా జేపీ మోర్గాన్‌ ఛేజ్‌ వంటి నంబర్‌ వన్‌ బ్యాంక్‌ రేటింగ్‌లో కూడా కోత పడే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యాంకుల రేటింగ్‌ AA- ఉండగా, దీన్ని A+కు తగ్గించే అవకాశముందని ఫిచ్‌ రేటింగ్‌ సంస్థ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. అయితే రేటింగ్‌ కోత ఎపుడు అన్న అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. జేపీ మోర్గాన్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాతో పాటు 70 బ్యాంకుల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసే అవకాశముంది. అధిక వడ్డీ రేట్లు సుదీర్ఘ కాలం కొనసాగడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది ఇక వడ్డీ రేట్లను అమెరికా కేంద్రం బ్యాంక్‌ -ఫెడరల్‌ రిజర్వ్‌- పెంచకపోయినా… ఇప్పటికే అధికంగా ఉన్న వడ్డీ రేట్లు బ్యాంకుల పనితీరును దెబ్బతీస్తున్నాయని బ్యాంకింగ్‌ రంగ నిపుణులు అంటున్నారు. ఫిచ్‌ వార్నింగ్‌తో అమెరికా బ్యాంకుల షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. మొత్తానికి వాల్‌స్ట్రీట్‌ అర శాతం దాకా నష్టాల్లో ఉంది.