డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ఫిర్యాదు
టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమలో వినిపిస్తున్న గుసగుసలు నిజమయ్యాయి. ప్రశాంత వర్మకు తాము ఎలాంటి డబ్బు ఇవ్వలేదని మైత్రీ మూవీస్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ప్రముఖ నిర్మాత నిరంజన్ రెడ్డి … ప్రశాంత వర్మపై తెలుగు ఫిలిమ్ ప్రొడ్యూసన్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. తమ బ్యానర్ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ తరఫున నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. హౌస్ అరెస్ట్, బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్, హనుమాన్, డార్లింగ్ వంటి చిత్రాలను నిర్మించిన నిరంజన్ రెడ్డి తన ఆరు పేజీల ఫిర్యాదులో అనేక అంశాలను ప్రస్తావించారు. తమను ప్రశాంత వర్మ మోసం చేశారని, ఆయన వల్ల భారీ ఎత్తున వ్యాపార అవకాశాలను పోగొట్టుకున్నామని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2020లో ప్రశాంత వర్మ డైరెక్టర్‌గా నిరంజన్ రెడ్డి హనుమాన్ మూవీ తీశారు. ఆ సినిమా అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. అపుడే తాము జై హనుమాన్ సీక్వెల్ మూవీ తీయాలని నిర్ణయించినట్లు నిరంజన్ రెడ్డి వెల్లడించచారు. అందులో భాగంగా అధీర, మహాకాళి, జై హనుమాన్ (సీక్వెల్), బ్రహ్మ రక్షస్ మూవీల నిర్మాణానికి ప్రశాంత వర్మతో డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపారు. ప్రశాంత వర్మ సినిమాటిక్ యూనివర్సల్, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ కింద ఈ సినిమాలు తీసేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. ఆ తరవాత ఈ సినిమాల కోసం తాము విడతల వారీగా భారీ మొత్తాన్ని ప్రశాంత్‌కు చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో చాలా మొత్తం బ్యాంక్ ట్రాన్స్‌ఫర్స్ ద్వారా, మిగిలిన మొత్తం క్యాష్ రూపంలో ఇచ్చామన్నారు. దీనికి సంబంధించిన వివరాలను తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తరవాత తన పర్యవేక్షణలో తన శిష్యులు సినిమా తీస్తారని ప్రశాంత్ తమను ఒప్పించారన్నారు. ఇది వరకే ఒప్పందం కుదరడంతో పాటు డబ్బులు కూడా ఇచ్చి ఉండటంతో వర్మ షరతులకు అంగీకరించామన్నారు. అయితే తాముఉ ఒప్పందం చేసుకున్న సినిమాలు ఏవీ సెట్స్‌పైకి వెళ్ళలేదన్నారు. ఈలోగా అక్టోపస్ అనే సినిమాను మరో నిర్మాతతో ప్రశాంత్ వర్మ తీశారని తెలిపారు. ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగా తమను భాగస్వామిగా చేరమని చెప్పారని అన్నారు. అయితే ఆ తరవాత అక్టోబపస్ సినిమా మధ్యలో ఆగిపోయిందని నిరంజన్ రెడ్డి అన్నారు. అప్పటికే షూటింగ్ చాలా వరకు అయినందున… తమను ఆ సినిమాను టేకోవర్ చేయమని ప్రశాంత్ కోరాడని చెప్పారు. దీనికి కూడా తాము డబ్బులు చెల్లించి ఎన్‌ఓసీ అడిగామని నిరంజన్ రెడ్డి తెలిపారు. అక్టోపస్ కోసం తాము రూ. 10,26,00,000 చెల్లించినట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ మొత్తాన్ని ప్రశాంత వర్మకు చెందిన ఫ్లిక్స్‌విల్లే కంపెనీకి ఇచ్చామన్నారు. అయితే తమకు ఎన్‌ఓసీ రాలేదని నిరంజన్ రెడ్డి తెలిపారు. అప్పటికే తమతో డీల్ కుదుర్చుకున్న సినిమాల కోసం తాము రూ. 10,34,50,000 ఇచ్చామన్నారు. దీంతో ప్రశాంత్ వర్మకు తాము మొత్తం రూ. 20,57,50,000 చెల్లించామని వెల్లడించారు. ఈ విషయంలో తాము పూర్తిగా మోసపోయాని, అనేక వ్యాపార అవకాశాలు కోల్పోయామని తమ ఫిర్యాదులో నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రశాంత వర్మ తమతో తీయాల్సిన హనుమాన్ సీక్వెల్ ‘జై హనుమాన్’ తీయకపోవడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయాని…దీనికి కింద తమకు రూ. 100 కోట్ల నష్టపరిహారం ప్రశాంత వర్మ నుంచి ఇప్పించాలని నిరంజన్ రెడ్డి కోరారు. అలాగే తమతో డీల్ చేసుకుని నిర్మించలేకపోయిన అధీరా, మహాకాలి, అక్టోపస్, బ్రహ్మ రక్షస్ సినిమాలకు ఒక్కో దానికి రూ. 25కోట్ల మేర నష్ట పరిహారం ఇప్పించాలని కోరారు. మొత్తం రూ. 200 కోట్ల నష్టపరిహారం ప్రశాంత వర్మ నుంచి ఇప్పించాలని ఫిలిం ఛాంబర్‌ను కోరారు. తమతో ప్రశాంత్ డీల్ చేసుకున్న సినిమాలను తీయకుండా ఆర్‌కేడీ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్, హోంబోలే ఫిలిమ్స్‌కు ఆదేశాలు ఇవ్వాలని కూడా తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరికొందరు…
మరికొందరు నిర్మాతలతో కూడా ప్రశాంత్ వర్మకు ఆర్థిక గొడవలు ఉన్నట్లు ఫిలిం నగర్‌లో వదంతులు ఉన్నాయి. చాలా మంది నిర్మాతలు ప్రశాంత వర్మకు భారీ మొత్తంలో అడ్వాన్సులు ఇచ్చి ఇరుక్కున్నట్లు తెలుస్తోంది.ఆ అడ్వాన్సులు అన్నీ కలుపుకొన్నా దాదాపు రూ 80 నుంచి రూ.100 కోట్ల వరకూ ఉంటాయని భావిస్తున్నారు. తన బదులు తన అసిస్టెంట్లు డైరెక్ట్ చేస్తారని నిరంజన్ రెడ్డి మాదిరిగానే ఇతర నిర్మాతలపై ఆయన ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తుంది. చాలా మంది దీనికి ససేమిరా అనడంతో పరిస్థితి సీరియస్‌గా మారింది. తమ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ అమౌంట్లను వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఫిలింనగర్‌లో ఈ తరహా వార్తలు వైరల్ అవుతున్నా ప్రశాంత వర్మ మాత్రం మౌనంగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇపుడు నిరంజన్ రెడ్డి బయటపడ్డారు. మరి ఆయన దారిలో ఇంకెంత మంది నడుస్తారో చూడాలి.
