For Money

Business News

అంతా 24 గంటల్లో జరిగిపోయింది

నోట్ల ర‌ద్దు గురించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నొటిఫికేష‌న్ చ‌ట్టవ్యతిరేక‌మని సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నాగ‌ర‌త్న స్పష్టం చేశారు. నోట్ల ర‌ద్దు అంశాన్ని స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ల‌పై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును వెలువ‌రించిన విషయం తెలిసిందే. అయిదుగురు స‌భ్యులు ఉన్న ధ‌ర్మాస‌నంలో నలుగురు కేంద్ర ప్రభుత్వ చర్ను సమర్థించగా జస్టిస్‌ నాగరత్న విభేదించారు. నోట్ల ర‌ద్దు విషయంలో పార్లమెంటు నిర్ణయం తీసుకుని ఉండాల్సిందని పేర్కొంది. 2016, న‌వంబ‌ర్ 8న‌, కేంద్రం జారీ చేసిన నోటిఫికేష‌న్ చ‌ట్టవ్యతిరేక‌మ‌ని, పిటిష‌న్లు దాఖ‌లు చేసిన‌వారితో ఏకీభ‌విస్తున్నట్లు జస్టిస్‌ నాగరత్న పేర్కొన్ఆనరు. ఆర్బీఐలోని సెక్షన్ 26 ప్రకారం.. ఆర్బీఐ స్వతంత్రంగా ఆలోచించి నోట్ల ర‌ద్దు సిఫార‌సు చేసి ఉండాల్సింద‌న్నారు. అయితే అలాంటి ప్రయత్నం చేలేదని ఆమె అన్నారు. అసలు అలా చేసే సమయమే లేదని ఆమె తేదీలతో సహా తీర్పులో పేర్కొన్నారు. కానీ 2016 నాటి సంఘ‌ట‌న‌పై ఇప్పుడు నిలుపుద‌ల చేయ‌లేమ‌ని తెలిపారు. ఇవాళ కోర్టులో జరిగిన అంశాలను లైవ్‌లా వెబ్‌ సైట్ పేర్కొంది. ఆ వెబ్‌సైట్‌లో పేర్కొన్న దాని ప్రకారం జస్టిస్‌ నాగరత్న ఏమన్నారంటే… ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం సమర్పించిన డాక్యుమెంట్లను, రికార్డులను పరిశీలించిన తరవాత తేలిందేమిటంటే… అసలు నోట్ల రద్దు ప్రతిపాదన ఆర్బీఐ వద్దే లేనే లేదని అని ఆమె అన్నారు. ”ఆర్బీఐ సమర్పించిన రికార్డులను చూస్తే… కొన్ని పదాలు, పదబంధాలు చాలాసార్లు దొర్లాయి. అవేమిటంటే… కేంద్ర ప్రభుత్వం అభిలషించినట్లుగా (as desired by the Central Govt) రూ.500,రూ. 1000 నోట్ల చట్ట బద్ధతను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది (Govt has recommended the withdrawal of legal tender of 500 and 1000 notes), సిఫారసును మా నుంచి తీసుకున్నారు.”recommendation has been obtained” etc వంటి పదాలను చూస్తే.. నోట్ల రద్దు అనే అంశం ఆర్బీఐ స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయం కాదనే చెప్పకనే చెబుతున్నాయి. పోనీ.. ఇలాంటి కీలక అంశంపై కనీసం స్వతంత్రంగా ఆలోచించే సమయమేమైనా ఉందంటే… అదీ లేదు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయాలన్న మొత్తం ప్రక్రియ కేవలం 24 గంటల్లో పూర్తి చేశార”ని జస్టిస్‌ నాగరత్న పేర్కొన్నారు.
అసలు ఈ నోట్లను రద్దు చేయాలన్న ఒరిజినల్‌ ప్రతిపాదన కేంద్రం నుంచి వచ్చిందని ఆమె తేల్చేశారు. 2016 నవంబర్‌ 7వ తేదీన కేంద్రం నుంచి ఆర్బీఐని ఉద్దేశిస్తూ వచ్చిన లేఖలో కేంద్ర ప్రభుత్వమే నోట్ల రద్దు ప్రతిపాదన చేసింది. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్‌ 26 (2) ప్రనకారం ఆర్బీఐ నుంచి ఒరిజినల్‌ ప్రతిపాదన రాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనను, ఆర్బీఐ నుంచి వచ్చిన ప్రతిపాదనగా పరిగణించలేమని జస్టిస్‌ నాగరత్న తెలిపారు. ఆర్బీఐ తన ఆమోదం తెలిపినంత మాత్రాన.. ఆ ప్రతిపాదన ఆర్బీఐ నుంచి వచ్చినట్లు కాదని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యేక సిరీస్‌ నోట్లను రద్దు చేస్తున్నపుడు ఏ సిరీస్‌ నోట్లయినా అన్న పదాన్ని అన్ని సిరీస్‌ నోట్లు అని అన్వయించుకోలేమని ఆమె తెల్చేశారు. దేశానికి పార్లమెంటు ప్రతిబింబమని… ఇలాంటి కీలక అంశాల్లో ప్రజాస్వామ్యానికి కేంద్రమైన పార్లమెంటును విస్మరించలేమని జస్టిస్‌ నాగరత్న స్పష్టం చేశారు.