For Money

Business News

2 వారాల్లో చైనా మార్కెట్‌ రికార్డు

భారత స్టాక్‌ మార్కెట్‌లో గత కొన్ని నెలలుగా వినిపిస్తూ వచ్చిన వదంతులే ఇపుడు నిజమయ్యాయి. అడ్డూ ఆపు లేకుండా… అనామక షేర్లు కూడా మూడంకెల స్థాయికి చేరుతున్నా… ఎవరూ పట్టించుకోలేదు. మోడీ మ్యాజిక్‌ను నమ్ముతూ వచ్చారు. స్టాక్‌ మార్కెట్‌లోని అనేక షేర్ల వ్యాల్యూయేషన్స్‌ వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని… కృత్రిమంగా పెంచుతున్నారని విదేశీ ఇన్వెస్టర్లు కొన్ని నెలల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్‌ఎంసీ రంగం ఓ మాయాబజార్‌లా మారింది. అయినా నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఎలాంటి చర్యలు లేవు. దీంతో చాలా నెలల నుంచి భారత మార్కెట్‌కు దూరంగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు నెల రోజుల నుంచి పెట్టుబడులు పెడుతున్నాయి. గత జనవరి నుంచి చైనా మార్కెట్‌లో భారీ పతనం మొదలైంది. ప్రభుత్వం అనేక స్పెక్యులేటివ్‌ కంపెనీలపై ఉక్కుపాదం మోపింది. బైజూ వంటి ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పే పలు చైనా కంపెనీలు అమెరికా నుంచి భారీగా నిధులు పొందాయి. అక్కడి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదై… భారీ లాభాలు పొందాయి. వాటిని కళ్ళెం వేసింది చైనా. ప్రభుత్వం పాఠాలను ప్రైవేట్‌ కంపెనీలు వీడియోలు తీయడాన్ని నిషేధించింది. అలాగే రియల్‌ ఎస్టేట్‌ రంగంపై కూడా గట్టిగా నియంత్రణలు విధించింది. దీంతో అనేక కంపెనీలు దివాళా తీశాయి. మొత్తానికి చైనా మార్కెట్‌ భారీగా పతనమైంది. చాలా షేర్లు రియలిస్టిక్‌ స్థాయికి వచ్చాయి. దీంతో భారత్‌ మార్కెట్‌ కన్నా చైనా మార్కెట్‌లో మంచి రిటర్న్స్‌ వస్తాయని ఫండ్‌ మేనేజర్లు కూడా అంటున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలో చైనా ఒక్కసారిగా భారీ సంస్కరణలు తెచ్చింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు మార్కెట్‌లో నిధులు భారీగా అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంది. దీంతో చైనా మార్కెట్లు దుమ్ము దులిపాయి. కేవలం రెండు వారాల్లో 52 వారాల కనిష్ఠ స్థాయి నుంచి 52 వాతారాల గరిష్ఠానికి తాకాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ 13వ తేదీన కనిష్ఠ స్థాయికి చేరిన చైనా మార్కెట్లు ఇదే నెల27వ తేదీన ఏడాది గరిష్ఠానికి చేరాయి. దీంతో మన దేశంలో విదేశీ పెట్టుబడుల ప్రవాహంపై అనుమానాలు పెరిగాయి. అయితే మన మార్కెట్లను స్థానిక రీటైల్‌ ఇన్వెస్టర్లు ఆదుకుంటూ వచ్చారు. ఈసారి వారే కాపాడుతారా లేదా అమ్మకాలకు పాల్పడుతారా అన్నది చూడాలి