For Money

Business News

విమానాల్లో BSNL బ్రాడ్‌బ్యాండ్ సేవలు

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ మరో ముందడుగు వేసింది. దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు సన్నద్ధమైంది. భారత్‌లో గ్లోబల్‌ ఎక్స్‌ప్రెస్‌ మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించడానికి తమ వ్యూహాత్మక భాగస్వామి బీఎస్‌ఎన్‌ఎల్‌కు లైసెన్సులు దక్కాయని బ్రిటిష్‌ శాటిలైట్‌ సంస్థ ఇన్‌మర్సాట్‌ తెలిపింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ పొందిన ఇన్‌ఫ్లైట్‌, మారిటైమ్‌ కనెక్టివిటీ లైసెన్సులతో ప్రభుత్వం, విమానయాన, నౌకాయనానికి చెందిన భారత వినియోగదార్లకు జీఎక్స్‌ సేవలు అందుబాటులోకి వస్తాయని ఇన్‌మర్సాట్‌ వివరించింది. భారత విమానయాన సంస్థలు భారత్‌తో పాటు, అంతర్జాతీయ మార్గాల్లోనూ జీఎక్స్‌ సేవలను అందించవచ్చు. విమానాల్లోపల కనెక్టివిటీని అందజేయవచ్చు. భారత వాణిజ్య నౌకా కంపెనీలు సైతం తమ నౌకలను డిజిటలీకరించవచ్చు. తద్వారా నౌకా కార్యకలాపాలు, సిబ్బంది సంక్షేమ సేవలను మరింత సమర్థంగా నిర్వహించవచ్చు.