తెలంగాణ బడ్జెట్ పది శాతం జంప్?
2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టనున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ బడ్జెట్ పద్దు పది శాతం దాకా పెరిగే అవకాశముంది. గత బడ్జెట్‌లో మొత్తం వ్యయం రూ.3,04,965 కోట్లుగా ఈసారి మొత్తం వ్యయం రూ. 3.30 లక్షలు చూపే అవకాశముంది. ఈసారి కూడా బడ్జెట్‌లో అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలకు అధిక కేటాయింపులు చేయనుంది రేవంత్ రెడ్డి సర్కారు. ముఖ్యంగా మూలధన వ్యయం పద్దు కింద ఈసారి రూ.45 వేల కోట్లు కేటాయించే ఛాన్స్ ఉంది. మూలధన వ్యయంలో తెలంగాణ దేశంలోనే టాప్ త్రీలో ఉంది. ఈసారి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అగ్రతాంబూలం ఇవ్వొచ్చు.ఈసారి కూడా మార్కెట్ నుంచి భారీ రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. బీఆర్‌ఎస్ హయాంలో తీసుకున్న అధిక వడ్డీ రుణాలను రీప్లేస్ చేయడంతో పాటు వాటిపై వడ్డీలు చెల్లించేందుకు భారీ మొత్తాన్ని కేటాయించాల్సి వస్తోందని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. గత బడ్జెట్‌లో వడ్డీల కోసం రూ.19,369 కోట్లు కేటాయించగా, ఈ పద్దు కింద రూ.25 వేల కోట్లకుపైగా చెల్లించే పరిస్థితి ఉందని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. ఈ కారణంగా రుణాల టార్గెట్ రూ.54 వేల కోట్లుగా అంచనా వేసి.. వాస్తవానికి రూ.70 వేల కోట్లు అప్పులు చేయాల్సి వచ్చిందని వీరు అంటున్నారు. కొత్తగా తీసుకుంటున్న రుణాల సొమ్ములో 70 శాతానికి పైగా పాతబాకీల వడ్డీల చెల్లింపులకే ఖర్చు చేస్తున్నట్లు వీరు అంటున్నారు. ఈ సారి రుణాల కింద తీసుకునే మొత్తం బడ్జెట్‌లో భారీగా పెరిగే అవకాశముంది.
