రూ. 2 లక్షల కోట్లకు పైగా పాయే…
2024 సంవత్సరం అదానీ కంపెనీ వాటాదారులకు అచ్చిరాలేదు. ఈ ఏడాది ఆరంభంలో హిండెన్ బర్గ్ రీసెర్చి చావు దెబ్బ తీసింది. అదానీతో పాటు ఆయన ఇన్వెస్టర్లు లక్షల కోట్లను కోల్పోయారు. ఇపుడు ఏడాది చివరల్లో మళ్ళీ పెద్ దెబ్బ. ఈసారి ఏకంగా అమెరికా ప్రభుత్వం నుంచి రావడంతో ఇన్వెస్టర్లు కలవరపడుతున్నారు. తాము ఉత్పత్తి చేసే విద్యుత్తను వివిధ రాష్ట్రాలకు అమ్మే సమయంలో అదానీ అవినీతికి పాల్పడ్డారని అమెరికా ఆరోపిస్తోంది. అధిక ధరకు విద్యుత్ కొనేందుకు ఇష్టపడిన రాష్ట్రాలకు వందల కోట్లలలో లంచాలు ఇచ్చినట్లు పేర్కొంది. ఇందులో ఏకంగా ఏపీ సీఎంకు రూ. 1750 కోట్ల లంచం అందినట్లు అమెరికా న్యాయ విభాగం ఆరోపించింది. జగన్ రెడ్డికి ఉన్న చరిత్ర, అదానీల మనీ పవర్ తెలిసిన ఇన్వెస్టర్లు… ఇవాళ ఉదయం నుంచే తమ దగ్గరున్న అదానీ షేర్లను అమ్మడం ప్రారంభించారు. గ్రూప్ ఫ్లాగ్ షిప్ కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజస్ పలుమార్లు లోయర్ సీలింగ్‌ను తాకింది. లోయర్ సీలింగ్ పడినపుడల్లా మరో సీలింగ్‌కు వెళుతూ వచ్చింది. అలాగే 20 శాతం సీలింగ్ వద్ద చాలాసేపు ఉంది. కాని క్లోజింగ్‌లో ఆ సీలింగ్‌ను కూడా దాటి 24 శాతం నష్టపోయి రూ. 2155ని తాకింది. ఒకే ఒక్క రోజులో ఈ షేర్ దాదాపు 800 రూపాయలు నష్టపోయింది. చివరల్లో 23.44 శాతం నష్టపోయి రూ. 2160 వద్ద ముగిసింది. రెండో ప్రధాన కంపెనీ అదానీ పోర్ట్స్‌ది కూడా ఇదే తీరు. ఒకదశలో 15 శాతంపైగా క్షీణించి రూ. 995ని తాకిన ఈ షేర్.. ఆ తరవాత స్వల్పంగా కోలుకుని రూ. 1119 వద్ద ముగిసింది. ఇదే గ్రూప్‌లోని మరో కంపెనీ అదానీ ఎనర్జి షేర్ 20 శాతం లోయర్ సీలింగ్‌లో క్లోజ్ అయింది. ఈ ధర వద్ద కొనేనాథుడు లేడు. ఇక అదానీ ఎనర్జి 18.95 శాతం తగ్గింది. అంబుజా సిమెంట్ కూడా 12.6 శాతం, అదానీ టోటల్ 10 శాతం పైగా నష్టపోయింది. ఇదే గ్రూప్‌నకు చెందిన అదానీ పవర్ 9.62 శాతం నష్టంతో రూ. 473 వద్ద ముగిసింది. ఇక ఏసీసీ 7.9 శాతం నష్టపోయి రూ. 2011 వద్ద ముగిసింది. ఇవాళ ఈ షేర్ రూ. 1868ని కూడా తాకింది. అదానీ విల్మర్ పరిస్థితి దారుణం. ఈ షేర్లను కొనేనాథుడు లేడు. ఒక దశలో పది శాతం సీలింగ్‌తో రూ. 143ని తాకిన ఎన్‌డీటీవీ చివర్లలో కోలుకుని క్రితం ముగింపు వద్ద ముగిసింది. మొత్తానికి ఇవాళ అదానీ గ్రూప్ షేర్లలో నేష్టాల వల్ల ఈ కంపెనీల ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ. 2.24 లక్షల కోట్లు తగ్గింది.