For Money

Business News

ఫెడ్‌ దెబ్బకు నిఫ్టి విలవిల

కరోనా సమయంలో ఇలాంటి పతనం చూశారు ఇన్వెస్టర్లు. ఇవాళ రాత్రికి అమెరికా మార్కెట్లు ఎలా ఉంటాయో ఇవాళ ప్రపంచ మార్కెట్లు చూపిస్తున్నాయి. వరుసగా అయిదు రోజులు నష్టపోయి… నిన్న గ్రీన్‌లో ముగిసిన అమెరికా మార్కెట్‌ భారీ పతనానికి సిద్ధమైంది. అమెరికా ఫెడ్‌ నిర్ణయం తరవాత ప్రపంచ మార్కెట్లన్నీ భారీగా పతమౌతున్నాయి. ఉదయం జపాన్ మార్కెట్లు మినహా ఇతర మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఇక హాంగ్‌సెంగ్‌ అమ్మకాలు వెల్లువెత్తడంతో రెండు శాతం పైగా క్షీణంచింది. ఇపుడు మన మార్కెట్లు ఉదయం వంద పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టి 150 పాయింట్లకు పైగా లాభపడింది. 15863 పాయింట్లను నిఫ్టి తాకింది. ఇదంతా 15 నిమిషాలు మాత్రమే. 9.30కి మొదలైన నిఫ్టి పతనం క్రమంగా రోజంతా సాగింది. మిడ్‌ సెషన్‌కు ముందు ఊపందుకున్న పతనం ఎక్కడా కోలుకునే ఛాన్స్‌ దక్కలేదు. 1.30కి కొన్ని పాయింట్లు పెరిగినా.. చివరిదాకా పతనం కొనసాగింది. ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 15335 కాగా, 15360 వద్ద నిఫ్టి ముగిసింది. అంటే కనిష్ఠ స్థాయి దగ్గ క్లోజైందన్నమాట. 500 పాయింట్లకు పైగా పతనం. క్రితం ముగింపుతో పోలిస్తే 331 పాయింట్లు అంటే రెండు శాతం పైగా పడగా ఇతర సూచీలు కూడా రెండు శాతంపైగా నష్టపోయాయి. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ ఏకంగా 2.68 శాతం నష్టపోయింది. నిఫ్టిలో నెస్లే, బ్రిటానియా తప్ప మిగిలిన 48 షేర్లు నష్టపోయాయి. వృద్ధికి ఇంతే సంగతలు అని వార్తలు రావడంతో మెటల్‌ షేర్లు భారీగా క్షీణించాయి. హిందాల్కో, టాటా స్టీల్‌ ఆరు శాతంపైగా నష్టపోగా వేదాంత 8 శాతం క్షీణించింది. సెయిల్‌, ఎన్‌ఎండీసీ 5 శాతంపైగా నష్టపోయాయి. నిఫ్టి మిడ్‌క్యాప్‌లో ఒక్క గెయినర్‌లేదంటే అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.