గౌతమ్ అదానీ ఎక్కడ?
ఇపుడు మనదేశంతో పాటు అమెరికాలోనూ కార్పొరేట్ వర్గాల్లో సంచలనం రేపుతున్న ప్రశ్న ఇది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఎక్కడ? తాము ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్‌ను సెకీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు అమ్మడానికి భారీ ఎత్తున ముడుపులు ఇచ్చారనే అభియోగాలను గౌతమ్ అదానీ ఇపుడు అమెరికాలో ఎదుర్కొంటున్నారు. మొత్తం డీల్స్‌లో 80 శాతం వరకు డీల్స్ ఏపీకి చెందిన మూడు డిస్కమ్‌తో కుదుర్చుకున్నవే. అందుకే మొత్తం రూ. 2029 కోట్ల ముడుపుల్లో రూ.1750 కోట్ల ముడుపులు ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారని అమెరికా న్యాయ విభాగంతో పాటు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అంటున్నాయి. వ్యాపార విస్తరణ కోసం లంచాలు ఇవ్వడమే గాక… తమ దేశ ఇన్వెస్టర్లను మోసం చేశారనే అభియోగాలను అదానీపై మోపింది అమెరికా న్యాయ శాఖ. 2019లో అదానీకి చెందిన అదానీ ఎనర్జి అమెరికా ఇన్వెస్టర్లకు బాండ్లను అమ్మింది. దీనిపై విచారణ చేసిన అమెరికా ఎఫ్‌బీఐ అవినీతికి సంబంధించి ఆరోపణలు చూపి.. అరెస్ట్ వారెంట్లు కూడా జారీ చేసింది. అయినా అదానీ మళ్ళీ అమెరికా సంస్థలు, ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించారు. అమెరికా అధికారుల దర్యాప్తు ప్రకారం ఇలా సమీకరించిన నిధులు 300 కోట్ల డాలర్లు సమీకరించారు.
మరి అదానీ ఎక్కడ?
వారెంట్లు జారీ అయిన తరవాత గౌతమ్ అదానీ ఎక్కడ ఉన్నారనే అంశంపై క్లారిటీ లేదు. గతంలో హిండెన్‌బర్గ్ రీసెర్చి ఆరోపణలు చేసినపుడు స్వయంగా గౌతమ్ అదానీ ఓ వీడియో విడుదల చేశారు. ఈసారి మాత్రం ఆయన కంపెనీ ప్రతినిధి చేత ఓ వీడియో చేయించి విడుదల చేశారు. మరి అదానీ ఎక్కడ ఉన్నాడనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇతర దేశాలకన్నా భారత్‌లోనే ఆయన రక్షణ ఉంటుందని… ఆయన భారత్‌లోనే ఉన్నారనే టాక్ కార్పొరేట్ రంగంలో వినిపిస్తోంది. మరి భారత్‌లో అదానీని అరెస్ట్ చేయాలంటే… ముందుగా భారత ప్రభుత్వానికి అమెరికా అధికారులు లేఖ రాయాల్సి ఉంటుంది. రెండు దేశాల మధ్య నిందితుల అప్పగింతకు సంబంధించి ఒప్పందం ఉంది. కాబట్టి ఎఫ్‌బీఐ నుంచి భారత్‌లో సీబీఐకి వర్తమానం రావాల్సి ఉంది. అయితే దీన్ని భారత కోర్టులో అదానీ సవాలు చేయొచ్చు. గతంలో కూడా బీచ్ శాండ్ మైనింగ్ కేసులో కేవీపీ రామచంద్రరావును అప్పగించాలని అమెరికా ఎఫ్‌బీఐ మన దేశానికి చెందిన సీబీఐకి లేఖ రాసింది. ఎఫ్‌బీఐ ఆదేశాలను కేవీపీ హైదరాబాద్ హైకోర్టులో సవాలు చేశారు. కోర్టు స్టే ఇచ్చింది. ఆ తరవాత ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలియదు? కేవీపీ కేసులోనే ఇలా జరిగితే… అదానీని అంత ఈజీగా అమెరికాకు మోడీ ప్రభుత్వం అప్పగిస్తుందా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. ఇందులో రాజకీయ నేతల ప్రమేయం అంటే ఏపీ అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమేయం కూడా ఉండటంతో…ఈ వ్యవహారంలో రాజకీయాలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ అప్పగింత వ్యవహారం మన కోర్టుల్లో ఎంత వరకు వస్తుందనేది చూడాల్సి ఉంటుంది.
అప్పీలా? రాజీనా?
ఈ కేసులోని ఆరోపణలు చాలా తీవ్రమైనవి. అందులో క్రిమినల్ కేసు కూడా ఉంది. కాబట్టి అమెరికా కేసులో అదానీ న్యాయపోరాటం చేస్తారా? లేదా రాజీకి వెళతారా అన్న చర్చ కూడా జరుగుతోంది. కొన్ని ఆరోపణలను తోసిపుచ్చుతూ .. ఇతర ఆరోపణలకు సంబంధించి కోర్టుతో అదానీ సెటిల్‌మెంట్‌కు వెళ్ళవచ్చు. దాదాపు రూ.4000 కోట్ల వరకు చెల్లిస్తే… సెటిల్‌మెంట్‌కు ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రాజీకి ఫైనల్‌గా కోర్టు ఆమోదం ఉండాలి. ఇందులో ఇన్వెస్టర్లను మోసం చేశారనే విషయంలో రాజీ పడితే పరవాలేదు కాని.. జగన్‌కు అవినీతి సొమ్ము విషయంలో రాజీ పడి… అదానీ ఈ కేసు నుంచి బయటపడితే… జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుపోతారు. ముడుపులు ఇచ్చినట్లు అదానీ అంగీకరించి సెటిల్‌మెంట్ చేసుకుంటే… మనదేశంలో జగన్మోహన్ రెడ్డిపై కేసులు నమోదు అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. అపుడు అదానీ కూడా మనదేశంలో కేసులో ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి అదానీ అంత రిస్క్ తీసుకుంటారా అన్నది చూడాలి. లేదా అమెరికా న్యాయ శాఖ చేసిన ఆరోపణలను వ్యతిరేకిస్తూ అదానీ అమెరికా కోర్టుల్లో న్యాయపోరాటం చేయొచ్చు. అయితే దీనికి అదానీ అమెరికా కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది. తొలుత ఆయన తరఫున లాయర్లు పిటీషన్లు వేసినా… ఆ తరవాత అదానీ హాజరు కాకతప్పదు.
నేరాలకు ఆధారాలు?
గౌతమ్ అదానీ సోదరుడి కుమారుడు సాగన్ అదానీ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ ఇపుడు చాలా కీలకంగా మారింది. అలాగే అజ్యూర్ పవర్ కంపెనీ అధికారులకు, అదానీ గ్రీన్ కంపెనీ అధికారుల మధ్య జరిగిన నెట్ కమ్యూనికేషన్ ఆధారాలు కూడా ఇపుడు ఎఫ్‌బీఐ చేతిలో ఉన్నాయి. అదానీ నేరుగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయినట్లు ఆధారాలు కూడా ఎఫ్‌బీఐ చేతిలో ఉన్నాయి. వాట్సప్ సందేశాలు, ఎక్సెల్ షీటు వంటి కీలక ఆధారాలు కూడా ఎఫ్‌బీఐకి చిక్కాయి. ఈ నేపథ్యంలో అదానీ కేసు చాలా కీలకంగా మారింది.
లొంగిపోయినా..?
అదానీలపై ఇపుడు నమోదైన కేసు ఓ పట్టాన తేలేది కాదు. ఒకవేళ అదానీని అరెస్ట్ చేసినా లేదా అమెరికాలో అదానీ లొంగిపోయినా… కేసు విచారణ పూర్తికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టొచ్చు. కొన్నేళ్ళు గడిచినా కేవీపీ కేసు అతీగతీ లేదు. అయితే కేవీపీ కేసులో ప్రధాన ముద్దాయి అయిన డిమిర్తి ఫిర్తాష్.. ఉక్రెయిన్‌లో నంబర్ వన్ కోటీశ్వరుడు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు కుడి భుజం. అలాగే ప్రపంచంలోనే నంబర్ వన్ అండర్ వరల్డ్ డాన్ సెమిన్ మోగ్లేవిచ్‌కు సన్నిహితుడు కూడా. ప్రపంచ అధినేతల ప్రమేయం ఉండటంతో ఆ కేసు ముందుకు సాగలేదు. మరి అదానీ కేసుకు అంత సీన్ ఉందా? పారిశ్రామికవేత్తలకు అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ చాలా సానుకూలంగా ఉంటారు. మరి అదానీ విషయంలో ఆయన ప్రమేయం ఉంటుందా అన్నది చూడాలి.