అయినా.. రిలయన్స్‌లో చలనం ఏదీ?
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్‌కు ఏమైందనే చర్చ ఇపుడు మార్కెట్‌లో తీవ్రంగా జరుగుతోంది. ఎక్స్ బోనస్ తరవాత ఈ కంపెనీ షేర్‌లో పెద్ద ఆసక్తి కన్పించడం లేదు ఇన్వెస్టర్లకు. మార్కెట్ నాన్ స్టాప్‌గా పడుతున్నందున రిలయన్స్‌కు ఏ స్థాయిలోనూ మద్దతు లభించడం లేదు. ఇవాళ రాయిటర్స్ రాసిన వార్తకు కూడా రిలయన్స్ కౌంటర్ చలించకపోవడంతో… ఈ షేర్ ఎపుడు పెరుగుతుందా అన్న టెన్షన్ ఇన్వెస్టర్లలో కన్పిస్తోంది. దాదాపు ఏడాది కనిష్ఠ స్థాయికి చేరువలో ఉంది ఈ షేర్. ఎక్స్ బోనస్ షేర్ ఇవాళ రూ. 1298 వద్ద ముగిసింది. రిలయన్స్ జియో టెలికాం పబ్లిక్ ఇష్యూ వార్త వచ్చిన తరవాత కూడా ఈ షేర్ మూడు శాతం నష్టంతో క్లోజ్ కావడం ఆశ్చర్యం కల్గిస్తోంది. నిఫ్టి భారీ పతనానికి కారణమైన షేర్లలో రిలయన్స్ ఒకటి. ఎందుకంటే సూచీలో ఈ షేర్‌కు వెయిటేజీ చాలా ఎక్కువ.
వచ్చే ఏడాది ఐపీఓ
వచ్చే ఏడాది జియో పబ్లిక్ ఇష్యూ వచ్చే అవకాశం ఉన్నట్లు రాయిటర్స్ వార్త సంస్థ వెల్లడించింది. కంపెనీ విలువ 10,000 కోట్ల డాలర్ల విలువతో ప్రైమరీ మార్కెట్‌లోకి వచ్చేందుకు జియో రెడీ అవుతున్నట్లు రాయిటర్స్ పేర్కొంది. ఇదే సమయంలో రిటైల్ విభాగం పబ్లిక్ ఆఫర్ ఇప్పట్లో ఉండే అవకాశం లేదని తెలిపింది. వాస్తవానికి ఈ రెండు కంపెనీలు పబ్లిక్ ఆఫర్ చేస్తాయని రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ 2019లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరవాత దీని గురించి ఆయన ఎక్కడా పెద్దగా ప్రస్తావించలేదు. దీంతో జనం రిలయన్స్ షేర్‌ను కూడా పట్టించుకోలేదు. బోనస్ ఉత్సాహం కూడా ఈ కౌంటర్‌లో కన్పించడం లేదు. 2025లో జియో పబ్లిక్ ఆఫర్‌కు వచ్చే వరకు రిలయన్స్ కౌంటర్‌లో ఆసక్తి అంతంత మాత్రంగానే ఉండే అవకాశముంది.