గుజరాత్‌లో పెట్రోల్ కొరత?
నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో ఇదే రచ్చ జరుగుతోంది. గుజరాత్‌లోని పలు నగరాల్లో పెట్రోల్ కొరత ఉందని వార్తలు రావడం ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడంతో…. ఏ పెట్రోల్ బంక్ చూసినా జనమే జనం. వేల మంది పెట్రోల్ బంకులకు చేరుకుంటున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్‌లో పెట్రోల్ పట్టడం నేరం కాగా, ఏకంగా పాలక్యాన్లలో పెట్రోల్ పడుతున్న దృశ్యాలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. అహ్మదాబాద్‌లోని దాదాపు అన్ని పెట్రోల్ బంకుల వద్ద వేల వాహనాలు చేరుకుంటున్నాయి. సూరత్, బరోడాలలో కూడా ఇదే పరిస్థితి. అన్ని ఛానల్స్‌లో ఇదే వార్తలు హైలెట్ కావడంతో సీఎం వెంటనే అత్యవసర భేటీ నిర్వహించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌తో పాటు గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని, సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మవద్దని ప్రజలను కోరారు. ఢిల్లీలో కూడా ఇవాళ పెట్రోలియం శాఖ కార్యదర్శి సుజాత కూడా గుజరాత్ అంశాన్ని ప్రస్తావించారు. కావాల్సినంత నిల్వలు ఉన్నాయని, జనం భయంతో నిల్వ ఉంచుకోవద్దని ఆమె కోరారు. మరోవైపు పెట్రోల్ పంపుల వద్ద గుజరాత్ ప్రభుత్వం పోలీసులను పంపింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, అలా ఉందని ఎవరైనా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పెట్రోల్ పంపుల వద్ద పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ ప్రకటనల సంగతేమో గాని… జనం మాత్రం భారీ సంఖ్యలో పెట్రోల్ పంపులకు ఇంకా చేరుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.
