For Money

Business News

నిఫ్టి జోరు అనుమానమే

నిఫ్టి ఇవాళ స్థిరంగా లేదా స్వల్ప నష్టాలతో ప్రారంభం కానుంది. శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లదీ అదే తీరు. ప్రధాన మార్కెట్లు ఒకటిన్నర నుంచి రెండు శాతం వరకు నష్టాలతో ట్రేడవుతున్నాయి. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు అధికంగా ఉండొచ్చనే వార్తలు మళ్ళీ వినిపిస్తున్నాయి. డాలర్‌ భారీగా పెరగడంతో… ఇవాళ ఓపెనింగ్‌లోనే రూపాయి 0.75 శాతం నష్టపోయింది. మళ్ళీ డాలర్‌తో 82.42 వద్ద రూపాయి ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప నష్టాలతో ప్రారంభం కానుంది. నిఫ్టిలో ఇవాళ ట్రేడింగ్‌ చేయకపోవడం మంచిదని సీఎన్‌బీసీ టీవీ 18 మేనేజింగ్‌ ఎడిటర్‌ అనూజ్‌ సింఘాల్‌ అంటున్నారు. నిఫ్టి 17400 వద్ద మద్దతు ఉందని, 18200 దాటితేనే నిఫ్టిలో తదుపరి ర్యాలీ ఉంటుందని ఆయన అన్నారు. దీంతో 800 పాయింట్ల రేంజ్‌లో నిఫ్టి ఇరుక్కుపోయింది. డే ట్రేడర్స్‌ నిఫ్టిని షార్ట్‌ చేసినా… స్ట్రిక్ట్ స్టాప్‌లాస్‌తో చేయాలని అనూజ్‌ సలహా ఇచ్చారు. 17700 వద్ద పుట్‌ రైటింగ్‌ జోరుగా ఉంది. అంటే ఈ స్థాయి వద్ద నిఫ్టికి గట్టి మద్దతు లభించే అవకాశముంది. అంతర్జాతీయ మార్కెట్లు చాలా బలహీనంగా ఉన్నందున నిఫ్టి పెరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఐటీ షేర్ల నుంచి మద్దతు అందకపోవచ్చు. ఇపుడు ట్రేడర్ల దృష్టి మొత్తం ప్రభుత్వ బ్యాంకులపై పడింది. మరి నిఫ్టికి ఈ రంగం నుంచి ఏ మాత్రం మద్దతు లభిస్తోందో చూడాలి.