For Money

Business News

40% దాకా పడిన నిఫ్టి షేర్లు

అక్టోబర్‌ నెల స్టాక్‌ మార్కెట్‌కు పీడకలగా మారింది. అనేక షేర్లు భారీగా నష్టపోయాయి. ఇవి మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లే కాదు. బహుబలి నిఫ్టి షేర్లకు పతనం తప్పలేదు. నిఫ్టిలో ప్రాతినిధ్యం వహించే 50 షేర్లలో 21 షేర్లు భారీగా నష్టపోయినట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ పేర్కొంది. 52 వారాల గరిష్ఠస్థాయి నుంచి కొన్ని షేర్లు 16 శాతం క్షీణించగా, ఈ ఏడాదిలో కొన్ని షేర్లు 38 శాతం దాకా క్షీణించాయి.
వీటిలో ప్రధానమైంది ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్‌. ఈ షేర్‌ ఈ ఏడాది జనవరి 15వ తేదీన రూ. 1695ని తాకింది. అక్కడి నుంచి క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. ప్రస్తుత పతనంలో మరింతగా దెబ్బతింది ఈ షేర్‌. ప్రస్తుతం ఈ షేర్‌ రూ. 1057 వద్ద ట్రేడవుతోంది. అంటే ఈ ఏడాదిలో ఈ షేర్‌ 38 శాతం పడిందన్నమాట.
ఒక రెండోది టాటా మోటార్స్‌. రూ. 550 నుంచి వంద లోపునకు పడిన ఈ షేర్‌ ఆ తరవాత పెరుగుతూ వచ్చింది. కరోనా తరవాత వచ్చిన ఆటో బూమ్‌లో ఈ షేర్‌ బాగా పెరిగింది. ఈ ఏడాది జులై 30వ తేదీన ఈ షేర్‌ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 1179ని తాకింది. ఇవాళ ఈ షేర్‌ రూ. 803కు పడింది. అంటే 35 శాతం దాకా పడిందన్నమాట. ఇవాళ ప్రకటించిన ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు దూరంగా ఉన్నాయి. దీంతో ఈ షేర్‌ రూ. 800లోపునకు వెళ్ళడం ఖాయంగా కన్పిస్తోంది. మద్దతు రూ. 750 వద్ద లభిస్తుందా లేదా రూ. 700 వద్దనా అనేది చూడాలి. ఇక ఈ ఏడాది బాగా నష్టపోయిన మరో నిఫ్టి షేర్‌ ఓఎన్‌జీసీ. ఈ షేర్‌ మూడు నెలల క్రితం అంటే ఆగస్టు 13న ఈ షేర్‌ రూ. 345ని తాకింది. ఇవాళ రూ. 261.30 వద్ద ముగిసింది. ఈ షేర్‌ పతనం 25 శాతంపైనే ఉంది.
నిఫ్టి షేర్లలో భారీగా పతనమైన మనో ఆటో కంపెనీ హీరో మోటోకార్ప్‌. ఈ షేర్‌ కూడా కేవలం మూడు నెలల్లో భారీగా క్షీణించింది. అంటే ప్రస్తుత కరెక్షన్‌లో బాగా దెబ్బతింది. సెప్టెంబర్‌ 24న ఈ షేర్‌ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 6246ని తాకగా… ఇవాళ రూ. 4,723 వద్ద ముగిసింది. అంటే ఈ షేర్‌ కూడా 25 శాతంపైగా నష్టపోయిందన్నమాట. ఇలాగే నష్టపోయిన మరో ఆటో షేర్‌ బజాజ్‌ ఆటో. ఈ షేర్‌ కూడా సెప్టెంబర్‌ 22వ తేదీన 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 12,774ని తాకింది. అక్కడి నుంచి ప్రస్తుత కరెక్షన్‌ బాగా క్షీణించింది. ఇవాళ రూ. 9902 వద్ద ముగిసింది. ఈ షేర్‌ కూడా ఈ మూడు నెలల్లో 20 శాతంపైగా తగ్గింది. ఏడాదిలో రూ. 2000 నుంచి రూ. 8300 దాకా పెరిగిన టాటా గ్రూప్‌ షేర్‌ ట్రెంట్‌. ఈ షేర్‌ అక్టోబర్‌ 14న రూ. 8343ని తాకింది. ఇది 52 వారాల గరిష్ఠ స్థాయి. కేవలం మూడు వారాల్లోనే ఈ షేర్‌ ఇవాళ రూ. 6,278ని తాకింది. ఈ షేర్‌ పతనం కూడా 25 శాతంపైనే. దేశ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి బాగా లేదన్న సంకేతాలను ఎఫ్‌ఎంసీజీ, ఆటో కంపెనీలు చెప్పకనే చెబుతున్నాయి. ఇదెంతకాలం కొనసాగుతుందో మార్కెట్ నిపుణులు కూడా అంచనా వేయలేకపోతున్నారు.

Leave a Reply