మళ్ళీ 24,200 దిగువకు…
ట్రంప్ గెలుపు ఉత్సాహం ఒక్కరోజులోనే కరిగిపోయింది. రెండు రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. ట్రంప్ గెలిచిన నేపథ్యంలో భారత్‌పై వాణిజ్య ఆంక్షలు ఉంటాయన్న ప్రచారం ప్రారంభమైంది. అలాగే గొప్ప కంపెనీలు కూడా చెత్త ఫలితాలను ప్రకటిస్తున్నాయి. గత నెల 14న రూ.8,345ని తాకిన టాటా కంపెనీ ట్రెంట్ ఇవాళ అంటే నెల కూడా తిర్కనే రూ. 6305ని తాకింది. చివర్లో స్వల్పంగా కోలుకుని రూ. 6530 వద్ద ముగిసింది. కంపెనీ ఫలితాలపై అనుమానాలే ఈ స్థితికి కారణం. హిండాల్కో వంటి కంపెనీలదీ అదే స్థితి. దీంతో ఆరంభంలో 24500ను దాటిన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే పడటం ప్రారంభమైంది. ఇక ఆ పతనం రోజంతా కొనసాగింది. ఒకదశలో 24179ని తాకినా.. తరవాత స్వల్పంగా పెరిగి 24,199 వద్ద ముగిసింది. నిఫ్టి కనిష్ఠ స్థాయి వద్దే ముగిసిందని చెప్పాలి. మిడ్ క్యాప్‌లో స్వల్ప ఒత్తిడి ఉండగా… ప్రధాని సూచీలపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. కొన్ని సూచీలు భారీగా క్షీణించాయి. నిఫ్టిలో ఏకంగా 46 షేర్లు నష్టాలతో ముగిశాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఫలితాలు బాగుండటంతో అపోలో హాస్పిటల్స్ 6 శాతంపైగా లాభపడి రూ. 7409 వద్ద ముగిసింది. ఆ తరవాతి స్థానంలో ఉన్న ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టీసీఎస్ షేర్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఇక నష్టపోయిన టాప్ నిఫ్టి షేర్లలో హిందాల్కో టాప్‌లో నిలిచింది. ఈ షేర్ 8 శాతంపైగా నష్టపోయింది. తరవాతి స్థానంలో ఉన్న ట్రెంట్ కూడా ఇవాళ 6 శాతంపైగా నష్టపోయింది. తరవాతి స్థానాల్లో గ్రాసిం, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్‌ప్రైజస్ ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఏమాత్రం ఆగడం లేదు. మద్దతుగా దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నా… రీటైల్ అమ్మకాలతో మార్కెట్‌లో అనేక షేర్లు భారీగా నష్టపోతున్నాయి.