ఒత్తిడి వచ్చినా…

ఇటీవల పలు మార్లు ఎప్పటికపుడు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలను తాకుతున్న సూచీలకు అదే స్థాయిలో ఒత్తిడి వస్తోంది. ఇవాళ కూడా అలాంటి ఒత్తిడి వచ్చినా… సూచీలు స్థిరంగా నిలిచాయి. 22500 స్థాయిని తాకేందుకు నిఫ్టి రెడీ అవుతోంది. కొత్త ఆర్థిక మంత్రి పేరు కోసం మార్కెట్ ఎదురు చూస్తోంది. ఈసారి నిర్మలా సీతారామన్‌కు ఆ శాఖ అప్పగించరని వార్తలు వస్తున్నాయి. పియూష్ గోయెల్ వంటివారికి ఈ శాఖ దక్క పక్షంలో నిఫ్టి మరికొన్ని కొత్త శిఖరాలను తాకే అవకాశముంది. ఈ నేపథ్యంలో నిఫ్టి ఇవా ళ చాలా ఆశాభావంతో ముగిసింది. నిఫ్టి తొలిసారి 23400 స్థాయిని తాకింది. అలాగే సెన్సెక్స్.. తొలిసారి 77 వేల పాయింట్ల స్థాయిని అధిగమించింది. అయితే గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణతో సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టి 31 పాయింట్ల నష్టంతో 23259 పాయింట్ల వద్ద క్లోజ్ కాగా, సెన్సెక్స్ 203 పాయింట్ల నష్టంతో 76,490 వద్ద ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రానుండటంతో మౌలిక రంగానికి చెందిన పలు షేర్లు భారీగా లాభాలు పొందుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఉన్న కంపెనీలు బాగా లాభపడ్డాయి. ఏపీలో అమరావతి నిర్మాణం ప్రారంభమైతే… సిమెంట్ డిమాండ్ భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇవాళ నిఫ్టిలో అల్ట్రాటెక్, గ్రాసింతో పాటు పలు ఇతర సిమెంట్ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఇక ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఇవాళ నిఫ్టిలోని దాదాపు అన్ని ప్రధాన కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఇక మిడ్ క్యాప్ ఐటీ షేర్లు సరేసరి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, ఎల్టీఐ మైండ్‌ట్రీ షేర్లు నిఫ్టి 50లో టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గే వరకు ఈ షేర్లలో ర్యాలీ అనుమానంగా కన్పిస్తోంది. మెటల్ షేర్లలో ఒత్తిడికి కారణం ఇదే. వేదాంత, సిందాల్ స్టీల్ వంటి షేర్లలో లాభాల స్వీకరణ కన్పిస్తోంది.