For Money

Business News

బాక్సాఫీస్‌కు కొత్త దారి

యాక్షన్‌, క్రైమ్‌ థ్రిల్లర్స్‌ ఉంటేనే థియేటర్‌కు వస్తారని తెలుగు పరిశ్రమ గట్టిగా నమ్మే రోజులు. అందుకే జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా కసకస అంటూ నరుక్కుంటూ పోయారు. హింస ఎంత క్రూరంగా ఉంటే అంత క్రేజ్‌. ఎన్ని బూతులు మాట్లాడితే సోషల్‌ మీడియాలో అంత వైరల్. పెద్ద హీరోలు కూడా ఇదే ఫార్ములాను నమ్ముకున్నారు. పుష్ప, కేజీఎఫ్‌ నుంచి దేవరకు వరకు ఇదే ట్రెండ్‌. ఫ్యామిలీ డ్రామాలు చూసేందుకు థియేటర్‌కు ఎవరు వస్తారు? ఓటీటీలో చూస్తారని గట్టిగా నమ్మే సినీ ఇండస్ట్రీకి లక్కీ భాస్కర్‌ ఓ గట్టి షాక్‌. హీరో ఎంత వయలెంట్‌గా అంతగా నచ్చేస్తాడని.. ఎక్స్‌పోజింగ్‌ హీరోయిన్‌కు ఉండాల్సిన తొలి అర్హతని నమ్మిన పరిశ్రమకు వెంకీ అట్లూరి సినిమా కొత్త పాఠం చెప్పిందనే చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్‌ను తీసుకువచ్చే సత్తా తనకు ఉందని నిరూపించాడు. కథను నమ్ముకుని… స్క్రీన్‌ప్లే పక్కగా రాసుకుంటే… ప్రేక్షకుడిని కట్టిపడేయొచ్చని నమ్మాడు. పాన్‌ ఇండియా సినిమాకు కావల్సిన ప్రధాన అర్హత కూడా ఇదేనని లక్కీ భాస్కర్‌ నిరూపించింది. తెలుగులో ఈ సినిమాకు ఎంత ఆదరణ లభించందో… మలయాళంలో అంతకన్నా ఎక్కువ ఆదరణ లభిస్తోంది. కేరళలో దీన్ని ఎవరూ డబ్బింగ్ సినిమాగా భావించడం లేదు. దుల్కర్‌ స్వయంగా ఈ సినిమాను కేరళలో విడుదల చేశాడు. రెండో రోజే థియేటర్ల సంఖ్యను పెంచాల్సి వచ్చింది. లక్కీ భాస్కర్‌ తమిళంలో కూడా మంచి టాక్ సంపాదించింది. ఒక మోసలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకు లక్కీ భాస్కర్‌ ఓ మలుపు అనే చెప్పాలి. సీతారామం తరవాత దుల్కర్‌కు తెలుగులో కూడా మంచి ఫ్యామిలీ ఆడియన్స్‌ లభించారు. ఓపెనింగ్స్‌ పెద్దగా లేకున్నా… ఎక్కువ రోజులు సినిమా ఆడిందంటే…అది ఫ్యామిలీ ఆడియన్స్‌తోనే సాధ్యమని చెప్పాలి. నిజానికి కథ రాశాక కొందరు తెలుగు హీరోలకు వెంకీ వినిపంచారనే టాక్‌ ఉంది ఫిలింనగర్‌. వారు తిరస్కరించిన తరవాత.. ఇది దుల్కర్‌ వద్దకు వెళ్ళింట. లవర్‌ బాయ్‌కు భిన్నమైన పాత్ర వెతుకుతున్న దుల్కర్‌ ఈ సినిమాకు ఓకే చెప్పారు. ఎపుడూ భిన్నమైన పాత్రలకు ఓకే చెప్పే దుల్కర్‌… లక్కీ భాస్కర్‌ను మరో స్థాయికి తీసుకువెళ్ళాడు. పెద్దగా హిట్‌ పాటలు లేకున్నా… ఫైట్స్‌ లేకున్నా.. ప్రత్యేకంగా ఓ విలన్‌ క్యారెక్టర్‌ లేకున్నా… హీరోకి నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్నా… సినిమా కథలో.. స్క్రీన్‌ప్లే ఉన్న దమ్ము. తగ్గట్టు పాత్రల్లో నటీనటులు రాణించడం. వెరశి ఆరంభం నుంచి చివరి దాకా ప్రేక్షకుడు రిలాక్స్‌ కాకుండా టెంపో కొనసాగిస్తే… ఫ్యామిలీ మూవీస్‌ చూడటానికి జనం థియేటర్‌కు వస్తారనడానికి సాక్ష్యం… లక్కీ భాస్కర్‌. రెండో రోజు కలెక్షన్స్‌ పెరగడానికి కారణం మౌత్‌ పబ్లిసిటీ. క్రమంగా తెలుగులో దుల్కర్‌కు మహిళా ఫ్యాన్స్‌ పెరుగుతున్నారు. తెలుగు హీరోలు Large than life పాత్రల వైపు పరుగులు పెడుతుంటే.. దుల్కర్‌ మాత్రం మధ్య తరగతి పాత్రలతో జనాన్ని ఆకట్టుకుంటున్నారు. తెలుగులో ఎప్పటి నుంచో ఉన్న గ్యాప్‌ను దుల్కర్‌ ఫిల్‌ చేస్తున్నాడా అన్న అనుమానం కల్గుతోంది. మొత్తానికి లక్కీ భాస్కర్‌ సక్సెస్‌… క్లీన్‌ మూవీస్‌ తీయాలనుకునే వారికి ఒక మంచి బూస్ట్ అని చెప్పొచ్చు. తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే తక్కువ ఖర్చుతో మంచి సినిమాలు తీయడమే కాదు… భారీ కలెక్షన్స్‌ సాధింవచ్చని లక్కీ భాస్కర్‌ నిరూపించింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే మూవీస్‌ ఇటీవల వచ్చినా… థియేటర్‌లో లాంగ్‌ రన్‌ నిలబడలేకపోయాయి. ఇలాంటి వారికి లక్కీ భాస్కర్‌ సక్సెస్‌ కొత్త ఉత్సాహాన్ని ఇవ్వొచ్చు. ఎంత పెద్ద సినిమా అయినా సరే…ఇపుడు ఫస్ట్‌ వీక్‌ వరకే నిలబడుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆకట్టుకునే లక్కీ భాస్కర్‌ వంటి సినిమాలు వస్తే… సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు కూడా మనగలుగుతాయి.