For Money

Business News

మిడ్‌ క్యాప్స్‌ ముంచేశాయి

ఫెడ్‌ వడ్డీ రేట్లను తగ్గించినా మన మార్కెట్లో ఎలాంటి చలనం లేదు. సాధారణ ఇన్వెస్టర్లు షాక్‌లో ఉన్నారు. రోజూ తమ పోర్టుఫోలియో ఐస్‌ ముక్కలా కరిగిపోతుంటే.. తాజా పొజిషన్స్‌ తీసుకోవడానికి జంకుతున్నారు. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు భారీ ఎత్తున అమ్మకాలు చేస్తున్నారు. నాన్‌స్టాప్‌గా. వారికి భారత మార్కెట్‌ ఏమాత్రం హేతుబద్ధంగా కన్పించడం లేదు. చైనా ఉద్దీపన ప్యాకేజీ ఇవాళ ప్రకటించనున్న నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు తమ అమ్మకాల జోరు పెంచుతున్నారు. అయితే ఇపుడు వీరి అమ్మకాలు మిడ్‌ క్యాప్స్‌కు కూడా పాకింది. నిఫ్టిలో పెద్ద తేడా లేకున్నా మిడ్‌ క్యాప్‌ షేర్లు చాలా దారుణంగా క్షీణిస్తున్నాయి. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ 100 సూచీ ఇవాళ 1.56 వాతం క్షీణించడమే దీనికి కారణం. ఎస్‌బీఐ ఫలితాలు బాగున్నా షేర్‌ రెండు శాతం నష్టపోయింది. దీంతో నిఫ్టి బ్యాంక్‌ కూడా 0.76 శాతం క్షీణించింది. ఇక నిఫ్టి పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీ ఏకంగా 2.19 శాతం క్షీణించింది. ఒక్క ఐటీ సూచీ తప్ప (అది కూడా అర శాతం మాత్రమే) మినహా మిగిలిన ప్రధాన సూచీలన్నీ క్షీణించాయి. ఇవాళ నిఫ్టిలో 1797 షేర్లు నష్టాల్లో క్లోజ్‌ కాగా, లాభాల్లో ముగిసిన షేర్ల సంఖ్య కేవలం 660 మాత్రమే. నిఫ్టికి చివరిక్షణంలో అందిన మద్దతు కారణంగా 24148 పాయింట్ల ముగిసింది. సెన్సెక్స్‌ కేవలం 55 పాయింట్లు నష్టపోయింది. ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ట్రెంట్‌ రూ. 6278 వద్ద 3.5 శాతంతో నష్టపోయింది. రూ.6200 ప్రాంతంలో ఈ షేర్‌కు మద్దతు లభించకపోతే… మరిన్ని నష్టాలు తప్పవని అనలిస్టులు అంటున్నారు. నిఫ్టి టాప్‌ లూజర్‌లో ఈ షేర్‌ టాప్‌లో నిలిచింది. తరువాతి స్థానాల్లో కోల్‌ ఇండియా, ఏషియన్ పెయింట్స్‌, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ నిలిచాయి. ఇక నిన్న మంచి ఫలితాలు ప్రకటించినా… పెరగని ఎం అండ్‌ ఎం షేర్ ఇవాళ 2.4 శాతంతో నిఫ్టి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. తరువాతి స్థానాల్లో టైటాన్‌, టెక్ మహీంద్రా, నెస్లే, ఇన్ఫోసిస్‌ నిలిచాయి.

Leave a Reply