గ్రామాల్లో 45 రోజులు దాటాకే సిలిండర్
వంటగ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ గ్రామీణ ప్రాంతాల్లో మరింత కష్టం కానుంది. సిలిండర్ల బుకింగ్ మధ్య గ్యాప్‌ను మరింత పెంచుతూ బీపీసీఎల్ నిర్ణయించింది. ఇతర ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఇదే పద్ధతి అవలంబించనున్నాయి. సింగిల్ సిలిండర్ ఉన్నవారికి 25 రోజుల తరవాత సిలిండర్ డెలివరీ ఉంటుంది. అదే డబుల్ సిలిండర్ ఉంటే బుకింగ్ మధ్య అంతరం కనీసం 35 రోజులు ఉండాలని బీపీసీఎల్ ప్రకటించింది. సాధారణంగా 21 రోజుల తరవాత సిలిండర్ ఇచ్చేవారు. యుద్ధం తరవాత మార్చి రెండో వారంలో ఈ గడువును 25 రోజులకు పెంచారు. తాజాగా 35 రోజులకు పెంచారు. ఇక ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన (పీఎంయూవై) వినియోగదారులకు సిలిండర్ బుకింగ్ గడువును 45 రోజులకు పెంచారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని బీపీసీఎల్ పేర్కొంది. ఇక ఏడాదికి 12 సిలిండర్ల కోటా పూర్తయిన వారు… మరో సిలిండర్ కావాలంటే నేరుగా హలో బీపీసీఎల్ యాప్‌కు వెళ్ళి బుక్ చేసుకోవాలి. బుకింగ్ సమయంలో కంపెనీ ప్రతినిధి కొన్ని ప్రశ్నలు అడుగుతారు, వాటికి సమాధానం ఇచ్చిన తరవాత మరో సిలిండర్ బుకింగ్‌కు అనుమతిస్తారు. కుటుంబ సభ్యులు ఎందరు? అతిథులు ఎవరైనా వస్తున్నారా? పెళ్ళి లేదా ఏదైనా శుభకార్యం లేదా ఫంక్షన్ ఉందా వంటి ప్రశ్నలు వేస్తారు. వాటికి సమాధానం రాబట్టిన తరవాతే బుక్ చేసుకుంటారు.
