For Money

Business News

ఒక్క రోజులో రూ.12.50 లక్షల కోట్లు

ఎగ్జిట్‌ పోల్స్‌లో మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని రావడంతో స్టాక్‌ మార్కెట్లు వెర్రెత్తిపోయాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీలు, బ్యాంకులు షేర్లు ఆకాశమే హద్దుగా పెరిగాయి. ఈ కంపెనీల్లో చాలా వాటా ప్రభుత్వం చేతిలో ఉండటం, మార్కెట్‌లో ఇన్వెస్టర్ల వద్ద చెలామణిలో ఉన్న షేర్లు తక్కువ కావడంతో… గత కొన్ని నెలలుగా ఈ షేర్లు భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ కూడా ఈ రెండు రకాల షేర్లతో పాటు డిఫెన్స్‌ రంగానికి షేర్లు కూడా భారీగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కేవలం ఒక్క రోజులో 12.5 లక్షల కోట్ల మేర పెరిగింది. దీంతో బీఎస్‌ఈలో నమోదైన షేర్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 5.1 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇవాళ అన్ని రంగాల షేర్లకు గట్టి డిమాండ్‌ లభించింది. ఆరంభంలో 23338 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన తరవాత వెంటనే 23062 పాయింట్లకు చేరినా… క్రమంగా కోలుకుంటూ 23,263 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి మూడు శాతంపైగా పెరగ్గా… స్మాల్‌ క్యాప్‌ షేర్లతో పాటు బ్యాంక్‌ నిఫ్టి నాలుగు శాతంపైగా పెరిగాయి. మిడ్‌ క్యాప్‌ సూచీ 3 శాతం పెరిగింది. మునుపెన్నడూ చూడని సరికొత్త గరిష్ఠాలను సూచీలు ఇవాళ తాకాయి. సెన్సెక్స్‌ తొలిసారి 76,400 మార్కును అందుకుంది. ఐటీ కౌంటర్లకు మాత్రం పరిమిత లాభాలు దక్కాయి. అదానీ గ్రూప్‌ షేర్లు ఇవాళ పరుగులు తీశాయి. ఆ గ్రూప్‌నకు చెందిన 10 లిస్టెడ్‌ కంపెనీలూ లాభాల్లో ముగిశాయి. అదానీ పవర్‌ అత్యధికంగా 16 శాతం మేర లాభపడగా, అదానీ పోర్ట్స్‌ 10 శాతం, అదానీ ఎనర్జీ 9.15 శాతం చొప్పున లాభపడ్డాయి. ప్రభుత్వ రంగ షేర్లలో ఎస్‌బీఐదే రికార్డు. ఈ షేర్‌ ఏకంగా పది శాతం దాకా పెరగడం విశేషం.