2025లో లక్ష డాలర్లు?
క్రిప్టో కరెన్సీని అమితంగా ఇష్టపడే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా రెండోసారి ఎన్నిక కావడంతో బిట్ కాయిన్ ఆల్ టైమ్ రికార్డు స్థాయి ధర పలికింది. ముఖ్యంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా ఎప్పటి నుంచో క్రిప్టో కరెన్సీకి మద్దతుగా నిలిచారు. ఆయన ట్రంప్ కేబినెట్‌లో కూడా చేరొచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో క్రిప్టో మార్కెట్ క్రేజ్ పెరిగింది. ఇవాళ చరిత్రలో మొదటిసారిగా బిట్ కాయిన్ 75 వేల డాలర్ల మార్కును దాటింది. డాలర్‌తో రూపాయి మారక విలువతో పోలిస్తే మన కరెన్సీలో ఒక్కో బిట్ కాయిన్ ధర .63 లక్షలు దాటింది. ట్రంప్ గెలుస్తారనే టాక్ మార్కెట్‌లో గత వారం నుంచే ఉంది. అయితే కమలా హారిస్, ట్రంప్ మధ్య పోటీ తీవ్రంగా ఉందనే వార్తల నేపథ్యంలో కూడా ట్రంప్ మద్దతుదారులు బిట్ కాయిన్ కొంటూ వచ్చారు. దీంతో బిట్ కాయిన్ ధర క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2009లో మార్కెట్‌లోకి వచ్చిన బిట్‌కాయిన్ అనేక హెచ్చుతగ్గులు చూపింది. ముఖ్యంగా ప్రభుత్వాల ఆంక్షలకు గురైంది. 2012 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కూడా బిట్ కాయిన్ ధర తీవ్ర ఒడుదుడుకులకు లోనైంది. ఒకదశలో 11 డాలర్ల నుంచి ఒక్కసారిగా 1100 డాలర్లకు పెరిగింది. అలాగే 2017లో కూడా బిట్ కాయిన్ ధర 700 డాలర్ల నుంచి 18 వేల డాలర్ల వరకు రికార్డు స్థాయిలో పెరిగింది. 2020లో ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరి 69వేల డాలర్లకు చేరినా…ఆ స్థాయిలో ఎంతో కాలం నిలదొక్కులేకపోయింది. తరవాత పడుతూ వచ్చింది. ఇవళ 75వేల మార్క్‌ను దాటింది. క్రిప్టో కరెన్సీ మార్కెట్ విశ్లేషకులు బిట్ కాయిన్ ర్యాలీపై గట్టి నమ్మకంతో ఉన్నారు. ఎలాన్ మస్క్ గనుక కేబినెట్‌లో చేరితే బిట్‌కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా జోరుగా పెరుగుతాయని అంటున్నారు. 2025లో బిట్ కాయిన్ లక్ష డాలర్లను దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని వీరు అంచనా వేస్తున్నారు.