DowJones: 1,300 పాయింట్లు జంప్
అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు ఒక శాతంపైగా పెరిగాయి. ఉదయం నుంచి ఆసియా దూకుడు ప్రదర్శించగా, మధ్యాహ్నం నుంచి యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ఉన్నాయి. ఇవాళ ఓపెనింగ్‌లో వాల్‌స్ట్రీట్ దూసుకుపోయింది. అన్ని ప్రధాన సూచీలు ఆల్‌టైమ్ రికార్డు స్థాయిని తాకాయి. ఎకనామీ షేర్లకు ప్రాతినిధ్యం వహించే డౌజోన్స్ సూచీ ఏకంగా 1300 పాయింట్లు పెరిగింది. ఈ సూచీ 3.15 శాతం పెరగ్గా, నాస్‌డాక్ 2.29 శాతం లాభపడింది. ఇక ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 1.94 శాతం లాభంతో ట్రేడవుతోంది. ట్రంప్ మీడియా టెక్నాలజీస్ 10 శాతం పెరగ్గా, ఎలాన్ మాస్క్‌కు చెందిన టెస్లా ఏకంగా 12 శాతంపైగా లాభంతో 282.18 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ప్రధాన ఐటీ కంపెనీల్లో మెటా ఒక్కటే నష్టాల్లో ఉంది. యాపిల్ కూడా నామమాత్రపు లాభాల్లో ఉంది. అధ్యక్ష ఎన్నికలతో పాటు సెనేట్‌లోనూ రిపబ్లికన్ అభ్యర్థులు మెజారిటీ స్థానాలు పొందారు. ప్రజాప్రతినిధుల సభలోనూ రిపబ్లికన్లదే పైచేయి కావడంతో… పలు చట్టాల్లో ట్రంప్ అనేక కీలక మార్పులు తెస్తారని భావిస్తున్నారు. ముఖ్యంగా అక్రమ వలసలపై ఆయన కొరడా ఝళిపించే అవకాశం అధికంగా ఉంది. ట్రంప్ ఆర్థిక విధానాలపై అంచనా ఉన్న ఇన్వెస్టర్లు భారీగా డాలర్‌ను కొనుగోలు చేస్తున్నారు. నిన్న 0.8 శాతం పెరిగిన డాలర్ ఇండెక్స్, ఇవాళ రెండు శాతం దాకా పెరిగింది. దీంతో డాలర్ ఇండెక్స్ ఈజీగా 105ని దాటింది. అమెరికా బాండ్ ఈల్డ్స్ కూడా భారీగా పెరిగాయి. ఎన్నికలకు ముందకు 4 శాతం లోపే ఉన్న బాండ్ ఈల్డ్స్ ఇపుడు భారీగా పెరిగాయి. పదేళ్ళ బాండ్ ఈల్డ్ 4.45 శాతంపైగా ఉంది. బ్రెంట్ క్రూడ్ 75 డాలర్లకుపైగా ఉన్న సమయంలో డాలర్ ఈ స్థాయిలో పెరగడమంటే భారత్ వంటి వర్ధమానదేశాలకు కష్టమే.