రూ. 1,750 కోట్ల ముడుపులు?
అపుడు తండ్రి నిర్వాకం… ఇపుడు కొడుకు ఘనకార్యం. అమెరికాలో ఆంధ్రప్రదేశ్ పరువు గంగపాలు. ఒకవైపు వైఎస్ హయాంలో జరిగిన అంతర్జాతీయ బాక్సైట్ స్కామ్ తేలకుండానే… జగన్ హయాంలో జరిగిన మరో స్కామ్ ఇపుడు అంతర్జాతీయ మార్కెట్‌లో మార్మోగిపోతోంది. ఇవాళ ఉదయం నుంచి రాయిటర్స్, సీఎన్ఎన్ వంటి వార్తా సంస్థలు ప్రత్యేక కథనాలు రాస్తున్నాయి. పైకి ఇదంతా అదానీ గ్రూప్ కంపెనీలు ఇచ్చిన లంచాల కేసుగా కన్పిస్తున్నా… లంచాలు తీసుకున్నవారి పేర్లు బయటకు రాకపోవడంతో జగన్మోహన్ రెడ్డికి రావాల్సిన పబ్లిసిటీ రావడం లేదు.
ఇంతకీ కేసు ఏమిటి?
అదానీ గ్రూప్‌నకు చెందిన కంపెనీలు, అజ్యూర్ పవర్ అనే కంపెనీ… సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. కేంద్రం మ్యాన్యుఫ్యాక్చరింగ్ లింక్డ్ స్కీమ్ అనే పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద అనేక రాయితీలు పొందిన ఈ కంపెనీలు తాము తయారు చేసే విద్యుత్‌ను అధిక ధరకు అమ్మాలని కుట్ర చేశాయి. నేరుగా అధిక ధరకు కొనేందుకు వివిధ రాష్ట్రాల కంపెనీల డిస్కమ్‌లు ముందుకు రావని తెలిసి… కేంద్రానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఎనర్జి కంపెనీని ముగ్గులోకి తెచ్చాయి. ఈ కంపెనికి చెందిన పలు అనుబంధ కంపెనీలు వివిధ కంపెనీల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసి, వివిధ రాష్ట్రాలకు అమ్ముతుంటాయి. సాధారణంగా ఇవి తక్కువ ధరకే అమ్ముతుంటాయి. ఎందుకంటే ఇవి ప్రభుత్వ రంగ కంపెనీలు కాబట్టి. అయితే ఇండియన్ ఎనర్జి కంపెనీతో అదానీ గ్రూప్ కంపెనీలు కుమ్మక్కు అయ్యాయని అమెరికా న్యాయ శాఖ తన చార్జిషీటులో పేర్కొంది. ఈ చార్జిషీటులో అంశాలను చూస్తే… అదానీ కంపెనీల నుంచి అధిక ధరకు కొనేందుకు ఇండియన్ ఎనర్జి అంగీకరించింది. ఇందులో ఈ సంస్థ అనుబంధ కంపెనీ అయిన సోలార్ ఎనర్జి కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) కీలక పాత్ర పోషించింది. ఈ మొత్తం డీల్‌కు అదానీ నుంచి ముడుపులు తీసుకుంది. మరి ఇండియన్ ఎనర్జి నుంచి అధిక ధరకు రాష్ట్రాలు ఎందుకు కొంటాయి. దీంతో స్వయంగా గౌతమ్ అదానీ రంగంలోకి దిగారని అమెరికా న్యాయ విభాగం పేర్కొంది. చత్తీస్‌ఘడ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్‌తో పాటు ఏపీకి చెందిన మూడు డిస్కమ్‌లతో అదానీ చర్చలు జరిపారు. మిగిలిన రాష్ట్రాలన్నీ కొనుగోలు చేసిన విద్యుత్ కేవలం 450 మెగావాట్లు కాగా, ఏపీకి చెందిన మూడు డిస్కమ్‌లు ఏకంగా 7 గిగావాట్ల విద్యుత్‌ను కొనేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో చాలా కంపెనీలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కాగా, ఏపీ కంపెనీలు కూడా అధిక ధరకు విద్యుత్ కొనేందుకు రెడీ అయ్యాయి. దీనికి గాను లంచాలు ఇచ్చేందుకు అదానీ స్వయంగా డీల్ చేశారని అమెరికా అంటోంది. మొత్తం డీల్ రూ. 2029 కోట్లు కాగా, ఒక్క ఏపీకే రూ. 1750 కోట్లు చెల్లించినట్లు అమెరికా న్యాయ విభాగం పేర్కొంది. ఒక్కో మెగా వాట్‌కు ఎంతో లంచం ఇవ్వాలో ముందు నిర్ణయించుకుని… మొత్తం డీల్ కుదిరాక… రాష్ట్రాలతో సెకీ ఒప్పందం చేసుకుంది. ఆ వెంటనే సెకీతో అదానీ కంపెనీలు డీల్ చేసుకున్నాయి. అంటే అధిక ధరకు సెకీకి అదానీ కంపెనీలు సోలార్ విద్యుత్ అమ్మితే… అధిక ధరకు సెకీ నుంచి రాష్ట్రాలు కొంటాయన్నమాట. దీనివల్ల రాగల 20 ఏళ్ళలో అదానీ కంపెనీలకు రూ. 20,000 కోట్ల నికర లాభం (అంటే ఖర్చులు, తరుగుదల, పన్నులు పోగా) వస్తుందని అమెరికా అధికారులు లెక్క గట్టారు. అంటే ఆమేరకు భారీ ఏపీ ప్రజలపై పడుతుందన్న మాట.
ముందే దర్యాప్తు
2020లో మొదలైన ఈ మొత్తం కుట్ర 2024 దాకా సాగినట్లు అమెరికా న్యాయ విభాగం పేర్కొంది. గత నెల అంటే అక్టోబర్ 24న అభియోగాలు నమోదు చేయగా, ఇవాళ బయటకు విడుదల చేసింది. వాస్తవానికి ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విభాగంతో పాటు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కూడా దర్యాప్తు చేసింది. వారెంట్లు ఇచ్చి ఎఫ్‌బీఐ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేశారు. స్వయంగా అదానీ మేనల్లుడు సాగర్ అదానీతో ఎఫ్‌బీఐ అధికారులు భేటీ కూడా అయ్యారు. గౌతమ్ అదానీపై సెర్చ్ వారెంట్ కూడా విడుదల అయింది. 2019 జూన్ నుంచి 2024 జూన్ వరకు ఏపీలో ప్రభుత్వం అధికారిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని న్యాయ విభాగం పరోక్షంగా తన అభియోగపత్రంలో పేర్కొంది. అయితే ఎస్‌ఈసీ మాత్రం తన అభియోగపత్రంలో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి అని స్పష్టంగా పేర్కొంది. 2021 ఆగస్టులో అదానీ స్వయంగా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారని.. ఇదే సమయంలో లంచాలకు సంబంధించి వీరి మధ్య అవగాహన కుదిరిందని అమెరికా న్యాయ విభాగం పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంలో మరో కీలక కంపెనీ అయిన అజ్యూర్ పవర్‌కు, అదానీ గ్రీన్ ఎనర్జి కంపెనీల మధ్య జరిగిన అంతర్గత కమ్యూనికేషన్లలో జగన్మోహన్‌తో కుదిరిన ముడిపుల వ్యవహారం ప్రస్తావన ఉందని చార్జిషీటులో పేర్కొన్నారు. జగన్‌తో అదానీ భేటీ తరవాత ఈ కమ్యూనికేషన్ జరిగినట్లు స్పష్టం చేశారు. ఒడిశా కంటే అధిక ధరకు ఏపీ డిస్కమ్‌లు సెకీ ఒప్పందం చేసుకున్నారు. గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీతో పాటు అదానీ గ్రూప్ ఉన్నతాధికారులపై కూడా అమెరికా అభియోగాలు మోపింది. మొత్తం 8 మందిని నిందితులుగా పేర్కొంది.