ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు…
దాదాపు రెండు నెలల తరవాత ఇవాళ మార్కెట్ అంతా గ్రీన్ కన్పించింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా రియాల్టి, ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల సూచీలు ఏకంగా మూడు శాతంపైగా లాభపడ్డాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయాన్ని మార్కెట్ ఇవాళ డిస్కౌంట్ చేస్తున్నట్లుగా కన్పించింది. ఇవాళ ఉదయం లాంగ్ పొజిషన్స్ తీసుకున్నవారికి అద్భుత లాభాలు అందాయి. నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లో 23369 పాయింట్లను తాకినా.. వెంటనే ఊపందుకుంది. ఒకదశలో 23,956 పాయింట్లను అంటే ఏకంగా 600 పాయింట్లు పెరిగింది. ఒక్క బజాజ్ ఆటో మినహా నిఫ్టిలోని అన్ని షేర్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. భారీ నష్టాల్లో నిన్న క్లోజైన అదానీ ఎంటర్‌ప్రైజస్, అదానీ పోర్ట్స్ రెండు శాతం లాభాలతో క్లోజయ్యాయి. అయితే అదానీ గ్రూప్‌లోని మెజారిటీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇవాళ మార్కెట్ అదానీ షేర్లను పట్టించుకోలేదు. ఇవాళ నాలుగు శాతంపైగా లాభంతో ఎస్‌బీఐ నిఫ్టి టాప్ గెయినర్‌గా నిలిచింది. తరవాతి స్థానాల్లో బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఐటీసీ, టీసీఎస్ నిలిచాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీల లాభాలు నిఫ్టికన్నా తక్కువగా ఉన్నాయి. అంటే ఇన్వెస్టర్లు వీటికన్నా లార్జ్ క్యాప్ షేర్ల వైపే అధికంగా మొగ్గు చూపుతున్నట్లు కన్పిస్తోంది. అమెరికాలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రీన్ ఇవాళ కూడా 8 శాతం నష్టంతో క్లోజైంది.