వీక్లీ బ్యాంక్ నిఫ్టికి గుడ్‌బై
మన స్టాక్ మార్కెట్లో అతి పెద్ద ఆప్షన్ కాంట్రాక్ట్ అయిన బ్యాంక్ నిఫ్టి వీక్లీ ఆప్షన్ కాంట్రాక్ట్ ఇవాళ చరిత్రలో కలిసిపోయింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో అత్యధిక టర్నోవర్ సాధించే… సాధారణ ఇన్వెస్టర్ల డార్లింగ్ అయిన ఈ ఆప్షన్ ట్రేడింగ్ ఇవాళ్టితో ఆగిపోయింది. ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్‌లో సాధారణ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారని నిపుణుల కమిటీ తేల్చడంతో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో వీక్లీ డెరివేటివ్ ఒక్కటే ఉండాలని… అదేదో తేల్చుకోవాలని బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెబి ఆదేశించింది.దీంతో సెన్సెక్స్ వీక్లీ డెరివేటివ్కు బీఎస్ఈ అంగీకరించగా, నిఫ్టికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎన్ఎస్ఈ. దీంతో ఇతర వీక్లీ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ ముగుస్తున్నాయి. ఇవాళ బ్యాంక్ నిఫ్టి క్లోజ్ కాగా, ఈనెల 18న నిఫ్టి మిడ్ క్యాప్ సెలెక్ట్ క్లోజ్ కానుంది. ఆ తరువాతి రోజు అంటే ఈనెల 19న నిఫ్టి ఫైనాన్షియల్ వీక్లీ ఆప్షన్ కాంట్రాక్ట్ ముగుస్తుంది. 20వ తేదీ నుంచి వీక్లీ ఆప్షన్స్‌లో నిప్టి, సెన్సెక్స్ మాత్రమే ఉంటాయి. బ్యాంక్ నిఫ్టి, ఫైనాన్షియల్ నిఫ్టితో పాటు నిఫ్టి మిడ్ క్యాప్ సెలెక్ట్ ఆప్షన్స్ నెలవారీ కాంట్రాక్ట్‌లు మాత్రం కొనసాగుతాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో ఆప్షన్ ప్రీమియం టర్నోవర్‌లో 38 శాతంతో నిఫ్టి బ్యాంక్ నంబర్ వన్ స్థానంలో ఉంది. 28 శాతం టర్నోవర్‌తో నిఫ్టి రెండోస్థానంలో ఉంది. చాలా వరకు టర్నోవర్ ఇక నుంచి నెలవారీ డెరివేటివ్స్‌కు మళ్ళుతాయని సెబి భావిస్తోంది. మరి ఏం జరుగుతోందో చూడాలి.