ఆ జోష్ లేదెందుకో!
ప్రపంచ మార్కెట్లు పిచ్చెక్కినట్లు పెరుగుతున్నాయి. కాని మన మార్కెట్లు మాత్రం ఒక శాతం లాభంతో సరిపెట్టుకున్నాయి. ట్రంప్ విజయం వార్తలతో రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ప్రధాన సూచీలన్నీ ఒక శాతంపైగా లాభంతో క్లోజయ్యాయి. అధ్యక్షపదవితో పాటు రిపబ్లికన్లకు అటు సెనేట్‌లోనూ ఇటు ప్రతినిధుల సభలో కూడా స్పష్టమైన మెజారిటీ రావడంతో అమెరికా ఫ్యూచర్స్ పట్టపగ్గాల్లేకుండా పెరుగుతోంది. సూచీలు మరో రెండున్నర శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఆసియాతో పాటు యూరప్ మార్కెట్లు కూడా ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. అయితే మన మార్కెట్లు మాత్రం ఒక శాతంతో సరిపెట్టుకున్నాయి. ఇవాళ బ్యాంక్ నిఫ్టికి వీక్లీ డెరివేటివ్స్ ఒక కారణం కాగా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా మద్దతు లేకపోవడం మరో కారణం. ఈ వారంలో చైనా ఎన్‌పీసీ ప్రకటించే ఉద్దీపన పాలసీ కోసం విదేశీ ఇన్వెస్టర్లు వెయిట్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి సెల్ ఇండియా, బై చైనా మూడ్‌లో ఉన్నారు. మరి ట్రంప్ వచ్చిన తరవాత వీరి వైఖరిలో మార్పు వస్తుందేమో చూడాలి. ఇవాళ్టికి నిఫ్టి 277 పాయింట్ల లాభంతో 24490 వద్ద ముగిసింది. ఒకదశలో 24537ని తాకినా చివర్లో లాభాల స్వీకరణ వచ్చింది. ఉదయం 24204 తాకిన నిఫ్టి దాదాపు 330 పాయింట్ల రివకరీ సాధించింది. ఇవాళ ఐటీ షేర్ల హవా జోరుగా ఉంది. అనేక షేర్లు భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టి టాప్ ఫైవ్‌లో బీఈఎల్ టాప్ గెయినర్‌గా నిలిచింది. తరువాతి స్థానాల్లో అదానీ ఎంటర్‌ప్రైజస్, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ నిలిచాయి. ఇక నష్టాలతో ముగిసిన నిఫ్టి షేర్లలో ఎస్‌బీఐ లైఫ్, టాటాన్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ట్రెంట్ నిలిచాయి. ట్రెంట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ప్రధాన షేర్ల కంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో మంచి ర్యాలీ వచ్చింది. ఈ సూచీలు రెండు నుంచి రెండున్నర శాతం లాభపడ్డాయి.