సెల్ ఇండియా – బై చైనా
గత కొన్ని రోజులుగా ఈ నినాదం స్టాక్ మార్కెట్‌లో బాగా వినిపిస్తోంది. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి. పిచ్చి కంపెనీలు కూడా రాత్రికి రాత్రి పెరిగిపోవడం… అనామక కంపెనీల పబ్లిక్ ఇష్యూలు కూడా భారీ సబ్‌స్క్రిప్షన్ రావడం… రెండు షోరూమ్‌లు ఉన్న ఓ కంపెనీకి వేల కోట్ల సొమ్ము దరఖాస్తుల రూపంలో రావడం… ఇవన్నీ… మన మార్కెట్ గాడి తప్పిందడానికి చిహ్నాలు. అడపాదడపా సెబీ హెచ్చరికలు చేస్తున్నా… ఎస్‌ఎంసీ రంగంలో గాంబ్లింగ్ సెంటర్‌గా మారింది. వ్యాల్యూయేషన్‌కు లెక్క లేకపోవడం, షేర్ల ధరల రిగ్గింగ్‌కు అంతే లేకుండా పోవడంతో… మార్కెట్ అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. సాంప్రదాయ ఇన్వెస్టర్లను ఇది బాగా కంగారు పెట్టించింది. అందుకే చాలా మంది ఓల్డ్ ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉన్నారు. అనేక మంది మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు… అధిక ధరల వద్ద షేర్లను అమ్మి… క్యాష్‌పై కూర్చున్నారు. ఇదంతా గమనిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లకు చైనా నుంచి అనూహ్య ఆఫర్ వచ్చింది. చైనా ఈక్విటీ మార్కెట్ల పని అయిపోయిందనే ప్రచారం బాగా జరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు, విదేశీ కంపెనీలు చైనాకు గుడ్ బై చెప్పినట్లు మీడియాలో పుంఖాపుంఖాలు కథనాలు వచ్చాయి. అయితే చైనా తన ఈక్విటీ మార్కెట్లను తనే కూల్చివేసిన విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. నీటి బుడగలా వచ్చిన డాట్ కంపెనీల మాదరి.. గత కొన్నేళ్ళుగా భారీగా పెరిగి ఐటీ, రియల్ ఎస్టేట్ కంపెనీలపై వేటు వేసింది. అవి ఆకాశం నుంచి భూమి మీదకు వచ్చాయి. ఆ దేశంలో స్పెక్యులేషన్ బుడగ బద్ధలైంది. షేర్ల వ్యాల్యూయేషన్ సమంజసంగా ఉన్న సమయంలో చైనా.. కొత్త ఉద్దీపన ప్యాకేజీకి రెడీ అయింది. ఇప్పటికే అనేక విప్లవాత్మక చర్యలు తీసుకుంది. లక్షల కోట్ల డాలర్లను ఆర్థిక వ్యవస్థలోకి తెచ్చింది. ఇవన్నీ గమనించిన విదేశీ ఇన్వెస్టర్లు భారీ మార్కెట్లకు గుడ్ బై చెప్పి… చైనాకు పరుగులు తీయడం ప్రారంభమైంది. గత నెలలో ఏకంగా లక్ష కోట్ల రూపాయల విలువైన షేర్లను నికరంగా అమ్మారు. ఈ నెలలో కూడా అదే ట్రెండ్ కొనసాగుతోంది. ఇవాళ్టి నుంచి చైనా ఎన్‌పీసీ సమావేశం ప్రారంభమైంది. శుక్రవారం ఈ సమావేశాలు ముగుస్తాయి. ఆ రోజున లేదా అంతకముందే చైనా మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించవచ్చనే వార్తలు వస్తున్నాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు మన బ్లూచిప్ కంపెనీల షేర్లను తెగనమ్ముతున్నారు. నిఫ్టిలో అధిక వెయిటేజీ ఉన్న రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో పాటు ఐసీఐసీఐ బ్యాంక్ వంటి షేర్లను అమ్మేస్తున్నారు. దీంతో సూచీలు భారీగా పడుతున్నాయి. ఈ షేర్లను దేశీయ ఇన్వెస్టర్లు ఒక మోస్తరుగా కొంటున్నారు. అయితే సూచీల పతనంతో సాధారణ ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. అయినకాడికి అమ్ముతున్నారు. దీంతో మిడ్ క్యాప్ షేర్లు భారీగా పడుతున్నాయి. ఒక్క సెన్సెక్స్ దాదాపు 8000 పాయింట్ల దాకా క్షీణించింది. ఇతర సూచీల పతనం ఇంకా జోరుగా ఉంది. మరి సెల్ ఇండియా- బై చైనా నినాదం ఎపుడు ఆగుతుందనే చర్చ ఇపుడు మార్కెట్‌లో జరుగుతోంది. వచ్చే నెలలో కూడా వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో జీడీపీ వృద్ధిరేటుపై అనుమానాలు పెరుగుతున్నాయి. అనేక కీలక పరిశ్రమలు పడకేశాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో పతనం ఎపుడు ఆగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. టెక్నికల్ అనలిస్టులు ప్రస్తుతానికి 23700, 23500 లేదా 23300 ప్రాంతంలో మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. ఈలోగా అమెరికా ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉండనుంది. ఏం జరుగుతుందో చూడాలి.