ఫెడ్ నిర్ణయానికి సానుకూలమే కానీ…
వరుసగా అయిదు రోజుల నష్టాల్లో ముగిసిన వాల్‌స్ట్రీట్ సూచీలు రాత్రి లాభాల్లో ముగిశాయి. ఫెడ్ నిర్ణయానికి ముందే మార్కెట్లు ముగిశాయి. డైజోన్స్ ఒక శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 1.45 శాతం, నాస్డాక్ 2.5 శాతం చొప్పున లాభాలతో ముగిశాయి. ఫెడ్ నిర్ణయం తరవాత అమెరికా ఫ్యూచర్స్ అరశాతం లాభంతో ఉన్నాయి. అయితే డాలర్ ఇంకా బలపడుతూనే ఉంది. దీంతో రాత్రికి అమెరికా మార్కెట్లు ఫెడ్ నిర్ణయానికి ఎలా స్పందిస్తాయో అన్న టెన్షన్ ఉంది. ఎందుకంటే మార్కెట్ 0.5 శాతం వడ్డీనే డిస్కౌంట్ చేసింది. మరోవైపు పదేళ్ళ ప్రభుత్వ బాండ్లపై ఈల్డ్స్‌లో కూడా పెద్ద మార్పు లేదు. కేవలం ఒక శాతం తగ్గింది. అయినా 3.36 శాతం వద్ద ట్రేడ్ అవుతుండటంతో ఈక్విటీ మార్కెట్ల లాభాలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. జులైలో కచ్చితంగా అర శాతం లేదా 0.75 శాతం వడ్డీ పెంపు ఉంటుందని ఫెడ్ ఛైర్మన్ పావెల్ జెరోమ్ అనడంతో మార్కెట్ దీర్ఘకాలిక లాభాలు ఎలా ఉంటాయో చూడాలి. ప్రస్తుతానికి ఫ్యూచర్స్ లాభాలు అంతంత మాత్రమే ఉండటంతో యూరో మార్కెట్ల స్పందన చూడాలి.