For Money

Business News

ఇవాళ అదానీ పేరున…

మార్కెట్‌ అంత్యంత కీలక మద్దతు స్థాయి వద్ద ట్రేడవుతున్న సమయంలో అదానీ కథ నిఫ్టిని దెబ్బ తీసింది. గత కొన్ని రోజులుగా 23500 స్థాయిని అతి కష్టంగా కాపాడుకొస్తోంది నిఫ్టి. అదానీ గ్రూప్‌ కంపెనీలు సోలార్‌ ఎనర్జి కంపెనీలు విద్యుత్ సరఫరా ఒప్పందాలు పొందేందుకు భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్లు అమెరికా న్యాయ శాఖ అభియోగాలు మోపింది. అక్టోబర్‌ 24వ తేదీన అభియోగాల వివరాలను న్యాయ శాఖ ఇవాళ విడుదల చేసింది. ముఖ్యంగా అదానీ గ్రీన్‌ ఎనర్జికి చెందిన పలు కాంట్రాక్ట్‌లపై సందేహాలు వ్యక్తమయ్యాయి. తాము ఉత్పత్తి చేసే విద్యుత్‌ను సికీ ద్వారా అధిక ధరకు అంటగడ్డేందుకు అదానీ గ్రూప్‌ దాదాపు రూ. 2000 కోట్లను భారత అధికారులకు లంచాలు ఇచ్చినట్లు తీవ్ర అభియోగాలు వచ్చాయి. దీంతో అదానీ గ్రూప్‌లోని దాదాపు అన్ని కంపెనీల షేర్లు ఇవాళ పతనమయ్యాయి. ముఖ్యంగా గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ ప్రైజస్‌తో పాటు కీలక కంపెనీ అయిన అదానీ పోర్ట్స్‌ షేర్లలో అమ్మకాలు హోరెత్తాయి. అనేక షేర్లు ఆరంభంలో లోయర్‌ సీలింగ్‌ను తాకాయి. కొన్ని కోలుకున్నా నష్టాలు మాత్రం 15 శాతంపైనే ఉన్నాయి. సిమెంట్‌ రంగానికి చెందిన అంబుజా సిమెంట్‌, ఏసీసీతో పాటు ఎన్‌డీటీవీ షేర్లు కూడా ఇవాళ భారీగా పడ్డాయి. వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకులకు తప్పుడు పత్రాలు సమర్పించి 300 కోట్ల డాలర్ల రుణాలు పొందినట్లు అమెరికా న్యాయ శాఖ ఆరోపించింది. దీంతో అదానీ గ్రూప్‌నకు భారీగా రుణాలు ఇచ్చిన బ్యాంకుల షేర్లు కూడా పడ్డాయి. ఎస్‌బీఐ ఒక దశలో 5 శాతం క్షీణించింది. ప్రైవేటీ బ్యాంకులతో పాటు ఐటీ సెక్టార్‌ షేర్లు నిఫ్టి చాలా వరకు కాపాడాయి. ఒకదశలో 23263 పాయింట్లకు క్షీణించిన నిఫ్టి క్లోజింగ్‌లో 23349 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 168 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో అదానీ ఎంటర్ ప్రైజస్‌ 23 శాతంపైగా నష్టపోగా, అదానీ పోర్ట్స్‌ కూడా 13.23 శాతం నష్టంతో ముగిసింది.

Leave a Reply